డిమాండున్న పంటలే వేయాలె

డిమాండున్న పంటలే వేయాలె
  • రికార్డుల కోసం వరి వేయొద్దు
  • మున్ముందు మనకే భారం: కేటీఆర్‌
  • సీఎం కేసీఆర్​దీ అదే మాట
  • గన్నీ సంచుల్ని సర్కారే కొంటది
  • 3 జూట్‌ మిల్లులకు ఎంవోయూ
  • వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డిల్లో ఏర్పాటు

హైదరాబాద్‌‌, వెలుగు: రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించామని చెప్పుకోడానికో, ఏపీ కన్నా ఎక్కువ పండించామని సంతృప్తి చెందడానికో వరి సాగు చేయొద్దని మంత్రి కేటీఆర్‌‌ కామెంట్ చేశారు. ఇలాంటి రికార్డులు తాత్కాలికంగా ప్రభుత్వానికి, రైతులకు బాగానే అనిపించినా మున్ముందు భారమవుతాయన్నారు. మార్కెట్‌‌లో డిమాండున్న పంటలే సాగు చేయాలని సీఎం కేసీఆర్‌‌ సూచిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మూడు జూట్‌‌ మిల్లుల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలతో శుక్రవారం ఒప్పందం జరిగింది. ఈ  సందర్భంగా కేటీఆర్‌‌ మాట్లాడారు. రైతులంతా ఒకే పంట సాగు చేస్తే దాన్ని కొనడం, మద్దతు ధర ఇప్పించడం ప్రభుత్వానికి చాలా భారమవుతుందన్నారు. అందుకే రైతులంతా పంట మార్పిడులపై దృష్టి పెట్టాలని సూచించారు. మార్కెట్‌‌లో ఎక్కువ అమ్ముడయ్యే పంటలే సాగు చేయాలని కోరారు.

కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైంలో రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున పంట చేతికి వచ్చిందని, దాన్ని కొనడానికి గన్నీ సంచుల కొరత ఏర్పడిందని కేటీఆర్ గుర్తు చేశారు. ‘‘సంచుల కోసం బెంగాల్‌‌‌‌ వైపో, బంగ్లాదేశ్‌‌‌‌ వైపో చూసే అవసరం ఉండొద్దనే ఇక్కడ జూట్‌‌‌‌ మిల్లులు పెట్టిస్తున్నాం. వరంగల్‌‌‌‌, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేసే ఈ మిల్లులతో 10,400 మందికి నేరుగా ఉపాధి దొరుకుతుంది. మూడు సంస్థలు రూ.887 కోట్ల పెట్టుబడులు పెడతాయి.  ఈ సంస్థలు ఉత్పత్తి చేసే గన్నీ సంచులను 25 ఏళ్లపాటు ప్రభుత్వమే కొంటుంది. రాష్ట్రం అన్ని రంగాల్లో ఆత్మనిర్భరత, స్వయం సమృద్ధి సాధించేందుకే ఇలాంటి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. తెలంగాణ వచ్చిననాటి నుంచి ఏడేళ్లలోనే ధాన్యం దిగుబడులు ఐదురెట్లు పెరిగాయి. తెలంగాణలో జనుము పండించడం లేదు కాబట్టి ఐదేళ్ల పాటు ముడిసరుకు తరలించేందుకు రవాణా రాయితీలిస్తాం” అని ప్రకటించారు. గన్నీ సంచులతో పాటు ప్లాస్టిక్‌‌‌‌కు ప్రత్యామ్నాయంగా జూట్‌‌‌‌ బ్యాగులు తయారు చేయాలన్నారు. మున్ముందు పక్క రాష్ట్రాల నుంచి గన్నీ సంచులకు డిమాండ్‌‌‌‌ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఈ సంస్థలను విస్తరించడంతో పాటు కొత్తవాటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే ధాన్యం కొనడానికి 50 కోట్ల గన్నీ బ్యాగులు కావాలని మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌ అన్నారు. తాము పండించిన పంటలను ప్రభుత్వం కొంటుందనే నమ్మకం రైతుల్లో ఉందన్నారు. కేసీఆర్‌‌‌‌ ఆలోచనలను దేశమంతా అనుసరిస్తోందని మంత్రి నిరంజన్‌‌‌‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 7 లక్షల నుంచి 10 లక్షల ఎకరాల్లో జనుము పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గ్లోస్టర్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌, ఎంబీజీ కమోడిటీస్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌, కాళేశ్వరం ఆగ్రో ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ సంస్థలతో పరిశ్రమల శాఖ ఈ సందర్భంగా ఎంవోయూ చేసుకుంది. గ్లోస్టర్‌‌‌‌ ఇండియా పశ్చిమబెంగాల్‌‌‌‌కు చెందింది కాగా మిగతా రెండు రాష్ట్రానికి చెందినవేనని అధికారులు తెలిపారు.

887 కోట్ల పెట్టుబడి.. 10,400 ఉద్యోగాలు
గ్లోస్టర్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ వరంగల్‌‌‌‌లో జూట్‌‌‌‌ మిల్లు పెట్టనుంది. రూ.330 కోట్లు పెట్టుబడితో 3,348 మందికి నేరుగా ఉద్యోగాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.254 కోట్ల పెట్టుబడులతో స్థాపించే మిల్లుతో 3,400 మందికి ఉద్యోగాలిస్తామని ఎంబీజీ కమోడిటీస్‌‌‌‌ చెప్పింది. కాళేశ్వరం ఆగ్రో కామారెడ్డి జిల్లాలో రూ.303 కోట్లతో జూట్‌‌‌‌ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 3,600 ఉద్యోగాలు రానున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేందర్‌‌‌‌, టెస్కాబ్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ కొండూరి రవీందర్‌‌‌‌ రావు, తదితరులు పాల్గొన్నారు.