ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

హైదరాబాద్‌‌ : ప్రధాని మోడీది దరిద్రపు ప్రభుత్వంగా దేశ చరిత్రలో నిలిచిపోతుందని, ఆయన అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యిందని మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం అనేక అబద్ధాలు చెప్తోందని విమర్శించారు. రూపాయి అత్యంత బలహీనపడడం, 30 ఏండ్లలోనే ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరడం, 45 ఏండ్లలో అత్యధిక నిరుద్యోగం, నైజీరియా లాంటి దేశాల కన్నా పేదరిక ప్రమాణాల్లో మన దేశం వెనుకబడి ఉండడం వంటి అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. చిన్నపిల్లలు కొనే పెన్సిళ్ల నుంచి హాస్పిటల్‌‌ బెడ్లు, అంత్యక్రియల వరకు అన్నింటిపైనా పన్నులేస్తూ దేశ ప్రజలను దోచుకుంటున్నారని ఫైర్​ అయ్యారు.

మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే కేంద్ర సంస్థలతో కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా గొప్పలకు పోవడం మాని ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ఆయన కోరారు. అలాగే పార్లమెంట్‌‌లో  ఆర్థిక వ్యవస్థపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అబద్ధాలు చెప్పారని ఆయన మండిపడ్డారు. కేంద్రం తీరుతో ప్రజలు ఉపయోగించే అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగాయన్నారు. జీఎస్టీలో అర్థంలేని స్లాబులతో పాలు, పెరుగు, బియ్యం లాంటి వస్తువులపైనా భారీగా పన్నులేస్తున్నారని దుయ్యబట్టారు. ద్రవ్యోల్బణం అదుపు తప్పడానికి పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారమే ప్రధాన కారణమన్నారు.