టికెట్లు ఇవ్వలేదని కొందరు నేతలు పార్టీ విడిచి వెళ్లారని మాజీ మంత్రి తుమ్మల,పొంగులేటిపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సభలో మాట్లాడిన కేటీఆర్.. నిన్నటి వరకు కేసీఆర్ ను దేవుడన్న వాళ్లు..టికెట్ ఇవ్వకపోయే సరికి దయ్యం అయ్యారా అంటూ ప్రశ్నించారు. 150 ఏళ్ల క్రితం పుట్టిన కాంగ్రెస్ వారెంటీ ఎప్పుడో అయిపోయిందన్నారు. కాంగ్రెస్ సచ్చిన పీనుగలాంటిపార్టీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో లో కమాండ్, కర్ణాటకలో న్యూకమాండ్, ఢిల్లీలో హైకమాండ్ ఉందని సెటైర్లు వేశారు.
ఆరు దశబ్దాలు కరెంట్, సాగు నీరు ఇవ్వని కాంగ్రెస్.. ఇపుడొచ్చి ఆరు గ్యారంటీలంటే నమ్ముదామా అని ప్రశ్నించారు కేటీఆర్. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్లు అడుగుతున్నారని.. వాళ్లకు 11 సార్లు అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని విమర్శించారు. 73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చాం..43 వేల కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి నల్లా ఇచ్చామన్నారు. రైతును రాజును చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ కు అధికారమిస్తే కుంభకోణాలు గ్యారంటీ అని విమర్శించారు కేటీఆర్. టికెట్ల కోసం కాంగ్రెస్ నేతలు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్ారని ఆరోపించారు. తానే ఇల్లు కట్టించి..తానే పెళ్లి చేయిస్తానని కేసీఆర్ చెబుతున్నారని.. పేదలకు అండగా కేసీఆర్ ఉన్నారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందన్నారు. ఎన్టీఆర్ కాలువ ద్వారా మూడు పంటలకు నీళ్లు అందుతాయన్నారు. ఆ పనిచేసేది ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆరేనన్నారు.