
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాకముందు.. వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు జరిగాయని కేటీఆర్ గుర్తు చేశారు. అభివృద్ధి విషయంలో ప్రపంచదేశాల్లో ఎన్నో నగరాలను దాటుకుని హైదరాబాద్ కు అవార్డు వచ్చిందని.. అందుకు తాను గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. మన్నెగూడలో లారీ ఓనర్స్, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముడి చమురు ధర రోజురోజుకి మారుతోందని చెప్పారు. సెస్సులు రద్దు చేసి పెట్రోల్, డీజిల్ ధర తగ్గించాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జన్ ధన్ పేరుతో 15 లక్షలు పడతాయని కేంద్రం చెప్పింది. కాని ఒక్క లబ్ధిదారుని ఖాతాలో కూడా పైసా పడలేదని చెప్పారు. గతంలో సిలిండర్ ధర రూ.400 ఉంటే ఇప్పుడు రూ.1200లకు పెంచారని మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారు కాని.. ఆడపిల్లకు ఎందుకు రాయితీలు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
ఫ్లోరోసిస్ వ్యాధిని తరిమికొట్టాం: మంత్రి కేటీఆర్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరోసిస్ వ్యాధితో ప్రజలు జీవచ్చవాలుగా మారిపోయారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతుంటే కేసీఆర్ తట్టుకోలేకపోయారని అన్నారు. నల్గొండ పరిధిలోని అన్ని గ్రామాల్లో కేసీఆర్ పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లోరోసిస్ ను తరిమికొట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుని.. నాలుగేళ్లలో ఫ్లోరోసిస్ ను పూర్తిగా నయం చేశారని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నామన్నారు. తెలంగాణ రాకముందు కరెంటు ఉంటే వార్త అని, ఇప్పుడు 15 నిమిషాల పాటు కరెంటు పోతే వార్త అవుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని సెక్టార్లకు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.
వాహన రంగం కుదేలైంది : మంత్రి అజయ్
వాహన రంగం కుదేలవ్వడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతితో లారీలు తిరగలేదనే ఉద్దేశంతో ట్యాక్స్ ను కూడా రద్దు చేశామని చెప్పారు. కరోనాతో ఫిట్ నెస్ సర్టిఫికేట్స్ రెన్యూవల్ చేసుకోలేని కారణంగా.. రోజుకు 50 రూపాయల ఛార్జ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేశారని చెప్పారు. గ్రీన్ ట్యాక్స్ ను తగ్గిస్తామన్నారు. 12ఏళ్ల లోపు సర్వీసు ఉన్న వాహనాలకు రూ.1500, 12ఏళ్లకు పైగా సర్వీసు కలిగిన వాహనాలకు రూ.3000 ఉండేలా వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాహనాల లైసెన్స్ లను అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయకుండా చూస్తామన్నారు. ఎక్కడైనా రవాణశాఖ అధికారులు ఇబ్బందులు పెడితే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కేసీఆర్, కేటీఆర్ చేతుల్లోనే ఉందని చెప్పారు.