కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ 

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ 

హైదరాబాద్, వెలుగు: మెట్రో పనుల విస్తరణకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి  మంత్రి కేటీఆర్ సోమవారం లేఖ రాశారు. బీహెచ్ఈఎల్ – లక్డీకాపుల్, నాగోల్–ఎల్బీనగర్ కారిడార్ల నిర్మాణానికి రూ.8,453 కోట్లు ఇవ్వాలని, దీనికోసం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు. ఇప్పటికే బీహెచ్ఈఎల్, లక్డీకాపూల్ మధ్య 26 కిలోమీటర్లు (23 స్టేషన్లతో) ఎల్బీనగర్ – నాగోల్ మధ్య (4 స్టేషన్లతో కూడిన 5 కిలోమీటర్ల మేర) మెట్రోను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ప్రాజెక్టులకు ఆర్థిక సాయాన్ని కోరేందుకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని స్వయంగా కలిసేందుకు సమయం అడిగినట్టు తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి  డీపీఆర్​ను కేంద్రానికి పంపినట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రజారవాణా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే వృద్ధి కొనసాగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల భాగస్వామ్యంతో ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. కరోనా తర్వాత హైదరాబాద్ లో ఊహించిన దానికంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు పెరిగాయని, పూర్తిస్థాయిలో ఆఫీసులు పనిచేస్తుండడంతో  మెట్రోను మరింత విస్తరించాలనుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఫేజ్-1లో 69 కిలోమీటర్ల మేర నడుస్తున్న మెట్రోకు అదనంగా మరో 31 కిలోమీటర్లకు విస్తరించాలనుకుంటున్నామని, తమ ప్రయత్నాలకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని  విజ్ఞప్తి చేశారు.