ఇల్లు కనబడుతలేదని చెట్లు నరికించిన మంత్రి మల్లారెడ్డి

ఇల్లు కనబడుతలేదని చెట్లు నరికించిన మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కోట్లు ఖర్చు పెట్టి హరితహారం పేరుతో మొక్కలు నాటిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. కానీ రోడ్డున పోయే వారికి తన కమర్షియల్ కాంప్లెక్స్‌‌ కనిపించకుండా అడ్డుగా ఉన్నాయనే కారణంతో సుమారు 70 చెట్లను మంత్రి మల్లారెడ్డి నరికేయించారు. కొన్ని చెట్లను వేళ్లతో సహా పెకిలించి వేయగా.. ఇంకొన్నింటి కొమ్మలన్నింటినీ తీసేయించారు. పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర సర్కారు ఏటా హరితహారాన్ని చేపడుతుంటే.. మంత్రిగా ఉన్న వ్యక్తి ఒకేసారి ఇన్ని చెట్లను నరికించడం ఏంటని అటవీశాఖ ఆఫీసర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మూడు చెట్లకు పర్మిషన్..
రాజీవ్ రహదారిని ఆనుకుని శామీర్‌‌‌‌పేట్‌‌ ఏరియా ఆలియాబాద్‌‌ వద్ద మల్లారెడ్డి ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌‌ను నిర్మించారు. దాని ముందు రోడ్డు పక్కన పెద్ద చెట్లు ఉన్నాయి. మంత్రి బిడ్డ చామకూర ప్రీతి పేరిట అప్లికేషన్‌‌ రావడంతో.. ఇక్కడ 3 చెట్లను నరికేందుకు అటవీశాఖ గతంలో పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఏకంగా 70 చెట్లను నరికివేయించారు. చెట్లు పెంచితేనే కరోనా వంటి రోగాలను అరికట్టగలమని, వర్షాలు కురుస్తాయని గతంలో స్పీచులు దంచిన మల్లారెడ్డి.. ఇప్పుడు చెట్లను నరికివేయించడం పై విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు చెట్టు నరికినా, జీవాలు మొక్కలను తిన్నా వేలల్లో ఫైన్లు వేసి, కేసులు పెట్టే అటవీ అధికారులు.. ఈ ఘటనపై మౌనం వహిస్తున్నారు. కేసీఆర్‌‌‌‌ రెగ్యులర్‌‌‌‌గా ప్రయాణించే రూట్ కావడంతో తామే మొక్కలు నాటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెంచామని, వాటిని నరికివేయడంతో తమకు బాధ కలుగుతోందని ఓ ఆఫీసర్ ఆవేదన వ్యక్తం చేశారు. మల్లారెడ్డి మంత్రి కావడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని చెప్పారు.