మార్కెట్ యార్డు నిర్మాణం కోసం 20 ఎకరాలు

మార్కెట్ యార్డు నిర్మాణం కోసం 20 ఎకరాలు

వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లాలో కొత్తగా నిర్మించనున్న మార్కెట్ యార్డు కోసం స్థలాన్ని గుర్తించాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. బుధవారం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రూ.2 కోట్ల 2 లక్షలతో చేపట్టనున్న వివిధ పనులను జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వైవిధ్యమైన పంటలు పండించేందుకు వికారాబాద్ అనుకూలంగా ఉండే ప్రాంతమని.. అందుకే జిల్లాలో హార్టికల్చర్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. 

ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ యార్డు స్థలం తక్కువగా ఉన్నందున రైతులకు ఇబ్బందిగా ఉందని ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన.. కొత్తగా మార్కెట్ యార్డు నిర్మాణం కోసం 20 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ  స్థలాన్ని గుర్తించి రిపోర్టు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ముద్ద దీప, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, అధికారులు పాల్గొన్నారు.