రైతులు బిచ్చగాళ్లలా కన్పిస్తున్నరా? కాంగ్రెస్ పై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

రైతులు బిచ్చగాళ్లలా కన్పిస్తున్నరా? కాంగ్రెస్ పై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా? అని మంత్రి నిరంజన్​రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. కొల్లాపూర్​ సభలో కాంగ్రెస్​ నాయకులు మాట్లాడిన తీరు దారుణంగా ఉందన్నారు. కృష్ణా నీళ్లను కిందికి వదిలేసి పాలమూరును ఎండబెట్టింది కాంగ్రెస్​ పార్టీ అయితే.. నీళ్లను ఎత్తిపోసి పొలాలకు మళ్లించింది బీఆర్ఎస్​ అని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రపంచంలోనే బెస్ట్ అని అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తే.. రైతుబంధును బిచ్చం అని కాంగ్రెస్ ​అంటోందన్నారు. 

రైతుల ఖాతాల్లో రైతుబంధు కింద 11 విడతల్లో రూ.72,815 కోట్లు వేసిన ప్రభుత్వం తమదేనని తెలిపారు. రైతు బీమా పథకం కింద 1,11,320 మంది రైతుల కుటుంబాలకు రూ.5,566 కోట్ల పరిహారం ఇచ్చామన్నారు. ఇలాంటి పథకాలు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేవన్నారు. ఏటా రూ.10 వేల కోట్లకు పైగా భరిస్తూ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్​ఇస్తున్నామని మంత్రి తెలిపారు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 58.29 లక్షల మంది రైతులకు రూ.29,144 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందబాటులో ఉంచుతున్నామని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పీడీ యాక్టులు పెడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ రాష్ట్రంలోని నియోజకవర్గానికి ఒక సభ పెట్టినా ఆ పార్టీ ​అధికారంలోకి రాదన్నారు.