
హైదరాబాద్, వెలుగు: ఆరు నెలల్లో ఆర్డీఎస్ ఎట్లా పూర్తి చేస్తవో కాయితం రాసి ఇస్తవా అని బండి సంజయ్‌కి మంత్రి నిరంజన్ రెడ్డి సవాలు విసిరారు. ఆర్టీఎస్ కొన, మొన కూడా ఆయనకు తెలియదని శుక్రవారం ప్రకటన లో పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల్లో పంపులు, రిజర్వాయర్లు కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్డీఎస్ కాలువ 42 కిలోమీటర్లు కర్నాటకలో ప్రవహిస్తుందని, ఆ రాష్ట్రాన్ని ఒప్పించి నీళ్లు ఇప్పించే దమ్ముందా అని ప్రశ్నించారు. ఆర్డీఎస్‌కు 15.9 టీఎంసీల కేటాయింపులున్నాయని, దీని కింద 87,500 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన ఉండగా, ఒక్క ఏడాది కూడా కర్నాటక ప్రభుత్వం 20 వేల ఎకరాలకు మించి నీళ్లు ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం తుమ్మిళ్ల లిఫ్ట్ నిర్మించి ఆర్డీఎస్ నీళ్లు అందని 50 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నదని తెలిపారు.