వినతి పత్రాలు ఇస్తే.. మెడికల్ కాలేజ్ ఇయ్యాల్నా!

వినతి పత్రాలు ఇస్తే.. మెడికల్ కాలేజ్ ఇయ్యాల్నా!

 

  •     ఎప్పుడు ఏ ప్రాంతానికి  ఏం ఇయ్యాలో కేసీఆర్​కు తెలుసు
  •     గద్వాలలో మంత్రి నిరంజన్​రెడ్డి

గద్వాల, వెలుగు: వినతి పత్రాలు ఇస్తే మెడికల్ కాలేజీ ఇయ్యాల్నా.. ఎప్పుడు ఏం చేయాలో.. ఏ ప్రాంతానికి ఏమివ్వాలో అంతా సీఎం కేసీఆర్ కు తెలుసు. గద్వాల జిల్లాలో నీటి సౌలభ్యం ఉంది కాబట్టి ప్రాజెక్టులు కట్టారు. అదే వేరే జిల్లాలో ప్రాజెక్టులు కట్టడం వీలవుతుందా అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని సర్కార్ దవాఖానలో డయాగ్నోస్టిక్​సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు రూపాయి ఖర్చు లేకుండా అన్ని టెస్ట్ ల తో పాటు ట్రీట్​మెంట్, మెడిసిన్ అందించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ కావాలని జోగులాంబ గద్వాల జిల్లా అఖిలపక్ష నాయకులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ సమయంలో కొంత గందరగోళం నెలకొంది. కచ్చితంగా మెడికల్ కాలేజీ కావాల్సిందేనని కార్మిక సంఘం నాయకులు బాల గోపాల్ రెడ్డి గట్టిగా అడిగారు. ఇంతలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలుగజేసుకుని జిల్లాకు వచ్చిన వారికి గౌరవం ఇవ్వాలని కోరారు. ఇంతలోనే ఆయన వినతిపత్రం తీసుకొని ఓపెనింగ్ సెంటర్ దగ్గరకు  వెళ్లిపోయారు. అక్కడ ప్రెస్ యూనియన్ సభ్యులు మెడికల్ కాలేజ్ కావాలని వినతిపత్రం సమర్పించారు. దీంతో మినిస్టర్ అసహనం వ్యక్తం చేస్తూ.. వినతి పత్రాలు ఇస్తే మెడికల్ కాలేజీ ఇయ్యాలా అంటూ ఎద్దేవా చేశారు. 

జిల్లాకు నర్సింగ్​ కాలేజీ

ఎమ్మెల్యే రిక్వెస్ట్ మేరకు గద్వాల జిల్లాకు నర్సింగ్ కాలేజీ మంజూరైందని, త్వరలోనే దాని పనులు ప్రారంభమవుతాయని మంత్రి చెప్పారు. అదేవిధంగా ప్రతి జిల్లాకో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు చేశామని, జోగులాంబ గద్వాల జిల్లాలోని కొండాపురం దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శృతి ఓజా, నాగర్ కర్నూల్ ఎంపీపీ రాములు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, జడ్పీ చైర్​పర్సన్​సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, ఎస్పీ రంజాన్ రతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.