
- 2 కోట్ల మంది వ్యవసాయంపై బతికేట్టు చేసినం
- మిగతా వాళ్లంతా ప్రభుత్వ, ప్రైవేటు జాబ్స్, వ్యాపారాలు చేసుకుంటున్నరు
- మంత్రి నిరంజన్‌రెడ్డి
యాదాద్రి, వెలుగు: ‘రాష్ట్రంలో 63 లక్షలకు పైబడి రైతు కుటుంబాలకు రైతుబంధు ఇస్తున్నాం. ఇలా సుమారు 2 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం. అంటే మొత్తం రాష్ట్ర జనాభాలో సగం మందికి వ్యవసాయం మీద బతికేట్టు చేసి వాళ్లకు బతుకుదెరువు చూపిస్తున్నాం’ అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో శుక్రవారం నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. రైతుబంధు తీసుకున్న వారిని మినహాయిస్తే మిగిలిన సగం జనాభా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారు అని అన్నారు. ‘ఉద్యోగమంటే.. పని చేసుకొని బతకడం. ఉద్యోగమంటే ఉపాధి. ఎవరికి ఏ స్కిల్ ఉంటే..ఉన్న శక్తిని బట్టి పనిని ఎంచుకుంటే ఆయా రంగాల్లో స్థిరపడేట్లు ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తోంది ’ అని అన్నారు.
పత్తి వేయనివారు బాధపడుతున్నారు
చెరువులు, కుంటల నీటితో ఆరుతడి పంటలు సాగు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పత్తి సాగు పెంచాలని, పత్తి ధర క్వింటాల్‌కు రూ.10 వేల వరకూ వస్తోందని, పత్తి పండించని రైతులు బాధపడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా చెరువులు, కుంటల నీటితో పత్తిని సాగు చేయాలని కోరారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్పమేల సత్పతి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్, కొలుపుల అమరేందర్, వస్పరి శంకరయ్య పాల్గొన్నారు.
మంత్రిని అడ్డుకునేందుకు బీజేపీ యత్నం
భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం రైతువేదికలో జరిగిన రైతుబంధు సంబురాలకు వస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డిని బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేశారు. సీఎం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు జై కేసీఆర్ అంటూ నినదించారు. తర్వాత వేదిక వద్దకు బీజేపీ కార్యకర్తలు ఉరుకుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. తర్వాత బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
యాదాద్రిలో నిరసన సెగ
యాదగిరిగుట్ట: యాదాద్రి డెవలప్మెంట్లో భాగంగా కొండపైన దుకాణాలు కోల్పోయిన బాధితులు మంత్రి నిరంజన్‌రెడ్డిని అడ్డుకున్నారు. శుక్రవారం గుట్టకు వచ్చిన మంత్రి తిరిగి వెళ్తుండగా వైకుంఠ ద్వారం వద్ద అడ్డగించారు. 'వీ వాంట్ జస్టిస్' అని ప్లకార్డులు చూపుతూ కాన్వాయ్ ను కదలనియ్యలేదు. దీంతో కారు దిగి వచ్చిన మంత్రి 'లొల్లి కావాల్నా పని కావాల్నా' అని ఆగ్రహించారు. ప్లకార్డులు తీసేస్తేనే మాట్లాడతానని చెప్పడంతో కిందికి దించారు. తర్వాత దుకాణదారులు మాట్లాడుతూ 2016లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం తిరిగి కొండపైనే షాపులు ఇవ్వాలని 10 రోజులుగా వర్తక సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆలయ ఆఫీసర్లు కొండపై షాపులు ఇచ్చేది లేదని చెబుతున్నారన్నారు. దీంతో మినిస్టర్ మాట్లాడుతూ సీఎం హామీని కచ్చితంగా నిలబెట్టుకుంటారన్నారు. ఆయన హామీని అనుమానిస్తే మీకే నష్టమని, ఇక మేమేం చేసేది ఉండందంటూ కారెక్కే ప్రయత్నం చేశారు. కేసీఆర్ హామీపై అనుమానం లేదని, ఆఫీసర్ల మాటలతో ఆందోళన చెందాల్సి వస్తోందని వ్యాపారులు చెప్పారు. తర్వాత వినతిపత్రం ఇవ్వగా, సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిపోయారు. వర్తక సంఘం అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి తడక వెంకటేశ్,వ్యాపారులు కొన్నె రమేశ్, సిలువేరు కిశోర్ గౌడ్, శివకుమార్, కలకుంట్ల శేఖర్, నల్లా వెంకట్ రెడ్డి, సంతోష్ రెడ్డి, మోహన్, ఆరె శ్రీధర్ గౌడ్ ఉన్నారు.