జాతీయ పార్టీకి గులాబీ జెండా, కారు గుర్తే ఉంటుంది

జాతీయ పార్టీకి గులాబీ జెండా, కారు గుర్తే ఉంటుంది

దసరా రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని ప్రకటిస్తారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. దసరా రోజు మంచి ముహూర్తం ఉందని, అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ కవిత వెల్లడించారు. జాతీయ పార్టీగా మార్పుపై 283 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులతో విస్తృత స్థాయి తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ఆమోదం తెలుపనున్నారని వివరించారు.

చిన్నపార్టీలను విలీనం చేస్తమని ముందుకొస్తున్నరు 

ఇప్పటికే చాలా మంది నాయకులు చిన్న పార్టీలను టీఆర్ఎస్ లో విలీనం చేస్తామని ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈనెల 5వ తేదీన కొంతమంది జాతీయ నేతలు ఈ సమావేశానికి వస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులు, యువతీ యువకులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనన్నీ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పారు.

5న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు.. 

ఈనెల 5న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత చెప్పారు. సమావేశంలో పార్టీ నిర్మాణంపై తీర్మానం చేస్తారని అన్నారు. కొత్త పార్టీకి కూడా గులాబీ జెండా, కారు గుర్తే ఉంటాయని స్పష్టం చేశారు.