ఏపీ శాసనమండలిలో తిరుమల కల్తీ నెయ్యి అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. సెషన్స్ మొదలైన రోజు నుంచి తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చకు పట్టుబడుతోంది ప్రతిపక్ష వైసీపీ. ఈ అంశంపై ప్రభుత్వం వైఖరికి నిరసనగా పలు మార్లు సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు. శుక్రవారం ( ఫిబ్రవరి 20 ) సభలో మరోసారి గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు సభలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడంతో సభ హీటెక్కింది. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో.. గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తూ సభలోకి వచ్చారు వైసీపీ సభ్యులు. వైసీపీ ఎమ్మెల్సీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్.
వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోలు ఉన్న ప్లకార్డులు పట్టుకొని రావడాన్ని తప్పుబట్టారు టీడీపీ నేతలు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్. సభలో వెంకటేశ్వర స్వామిని తీసుకురావడాన్ని స్పీకర్ అనుమతించొద్దని అన్నారు. వైసీపీ సభ్యులకు దేవుడంటే నమ్మకం, భయం, గౌరవం లేదని అన్నారు.
చట్టసభల్లోకి దేవుడి ఫోటోలు తీసుకురావడం అంటే.. దేవుడిని రాజకీయాల్లోకి లగడమేనని మండిపడ్డారు. చట్ట సభల్లోకి దేవుడి ఫోటోలు తీసుకురావడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని.. దేవుడిని అవమానిస్తున్నారని అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. వెంకటేశ్వర స్వామి ఫోటోను సభలోకి తెచ్చి హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు వైసీపీ సభ్యులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్.
