- సొంత ఆస్తుల కోసమే జూరాలను వదిలి శ్రీశైలం నీళ్లు తీసుకున్నరు: మంత్రి పొంగులేటి
- 100 మీటర్ల హైట్ ఉన్నా.. గ్రావిటీని వదిలి లిఫ్టులు కట్టిన్రు
- మేము పనులు చేస్తుంటే ఆ పార్టీ నేతలకు దురద పుడుతోందని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ఏపీ ఇచ్చిన జీవోలను కూడా సద్వినియోగం చేసుకోలేని కేసీఆర్.. దేశంలో సముద్రం పాలవుతున్న నీళ్లను ఒడిసిపడతానంటూ బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయిలో మీటింగులు పెట్టడం విడ్డూరంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి స్వార్థం కోసం, సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రాజెక్టుల డిజైన్లు మార్చి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు.
రాష్ట్ర విభజన తర్వాత పక్క రాష్ట్రం.. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 42 వేల క్యూసెక్కులకు, ఆ తర్వాత ఏకంగా 92 వేల క్యూసెక్కులకు పెంచుకుని మన నీళ్లను దోచుకుందని పొంగులేటి ఆరోపించారు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌కు ఈ విషయం తెలిసినా పట్టించుకోలేదన్నారు. పర్మిషన్ లేని ‘మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్’ కూడా కేసీఆర్ హయాంలోనే కట్టారన్నారు. . ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే జూరాల ప్రాజెక్టు కింద 70 టీఎంసీలకు, నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్‌కు 10 టీఎంసీలకు, ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌కు 30 టీఎంసీలకు జీవోలు ఇచ్చిందని పొంగులేటి గుర్తుచేశారు. శ్రీశైలం కంటే జూరాల 100 మీటర్ల ఎత్తులో ఉంటుందని, ఆ తేడాను గమనించకుండా కేసీఆర్ దిగువన ఉన్న శ్రీశైలం వద్ద ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు.
‘‘జూరాల దగ్గర 70 టీఎంసీల క్లియర్ అలకేషన్ ఉంది. అక్కడి నుంచి నీళ్లు తీసుకుని ఉంటే 22 రోజులు అదనంగా నీళ్లు దొరికేవి. 37 లిఫ్టుల ఖర్చు, కరెంట్ చార్జీలు ఆదా అయ్యేవి. ఆయకట్టుకు మేలు జరిగేది’’ అని మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన 30 ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశల్లోనే ఉన్నాయని, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేయకుండా నల్గొండకు అన్యాయం చేశారన్నారు. కేసీఆర్ సర్కార్ చేయలేని పనులను ఇప్పుడు తాము చేసి చూపిస్తుంటే.. బీఆర్ఎస్ నాయకులకు బాధ, దురద ఎక్కువైందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ సొమ్మును దోచుకున్నరు: వీరేశం
తెలంగాణను బీఆర్ఎస్ మోసం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్మును దాగా చేసి, దోచుకున్నారని ఆరోపించారు. గత పదేండ్లలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు మాత్రమే ఎక్కువగా నష్టపోయాయని అన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణంతో ఎర్రవల్లి, ఎర్రవెల్లి తండా గ్రామాలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ.. బీఆర్ఎస్ హయాంలో ఆగమైందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు.
మహబూబ్ నగర్లో 2013లో జూరాల సోర్స్ గా పాలమూరు ప్రాజెక్టు కట్టాలని ఉమ్మడి రాష్ట్రంలోనే ప్లాన్ చేయగా.. దాన్ని కమీషన్ల కోసం ప్లేస్ ను శ్రీశైలంకు మార్చారని ఆరోపించారు. ప్రాజెక్టులు, నీళ్లపై సభకు వచ్చి మాట్లాడాలని చెప్తే.. బీఆర్ఎస్ వాళ్లు బయట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు
