
- ఆరోపణలపై మంత్రి పొంగులేటి
- మంత్రి సురేఖతో ఎలాంటి విభేదాలు లేవని వెల్లడి
- మేడారం సందర్శించి మాస్టర్ ప్లాన్‌పై రివ్యూ
తాడ్వాయి, వెలుగు: మేడారం మహా జాతర లోపు మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.251 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సమ్మక్క–సారక్క గద్దెలను అభివృద్ధి చేయడానికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను మంత్రి సీత క్క, మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. ముందుగా మంత్రులు, ఎంపీ సమ్మక్క– సారక్క వనదేవతలను దర్శించుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో మాస్టర్ ప్లాన్ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడారం ఎందుకు రాలేదని జర్నలిస్టులు అడిగిన ప్రశ్న కు సమాధానమిస్తూ.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం ఎన్నో వందల కోట్లు ఖర్చు చేస్తుండగా రూ.75 కోట్ల కమీషన్ కోసం నేను కక్కుర్తి పడుతానా? ఎవరో ప్రాపగండా చేసిన వాటిని నమ్మొద్దు.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంటే ఎవరినైనా అడగండి. కమీషన్లకు కక్కుర్తి పడే వాన్ని కాదు’ అని మంత్రి అన్నారు.
ఇది మొదటి రివ్యూ అని, పనులు పూర్తయ్యే వరకు సుమారు 15 నుంచి 17 సార్లు పనుల పరిశీలన, సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. రాష్ట్ర మంత్రులు సీతక్క కొండా సురేఖ అక్కలు మరో సమ్మక్క సారక్క అని, వచ్చే రివ్యూకు వారితో కలిసి వస్తానని పొంగులేటి స్పష్టం చేశారు. ఈ సారి సుమారు రెండు కోట్లకు పైగా భక్తులు జాతరకు వచ్చే అవకాశం ఉందని వారందరికీ సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.