లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టాలి..కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రి పొంగులేటి ఆదేశం

లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టాలి..కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రి పొంగులేటి ఆదేశం
  •     ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి
  •     అధికారులందరూ అలర్ట్‌‌గా ఉండాలని సూచన
  •     సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు 
  •     రూ. కోటి చొప్పున రిలీజ్ ​చేసినట్టు వెల్లడి

హైదరాబాద్ , వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమీషనర్లు అప్రమత్తంగా ఉండాలని  మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సీఎం  రేవంత్ రెడ్డి సూచనల మేరకు.. సీఎస్​ రామకృష్ణారావుతో కలిసి  గురువారం సెక్రటేరియెట్​ నుంచి జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి  శ్రీనివాస్‌‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే, రెడ్ అలర్ట్ ప్రకటించిన మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ. కోటి చొప్పున విడుదల చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించడానికి ఉమ్మడి 10 జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామని చెప్పారు. 

వెంటనే విధుల్లో చేరాలి

సెలవుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది లీవ్స్‌‌ను రద్దు చేసుకొని.. వెంటనే విధుల్లోకి చేరాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న చోట్ల రక్షణ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌‌లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైల్వే లైన్లు, లో-లెవల్ బ్రిడ్జిలు, కాజ్‌‌వేలు వంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లో-లెవల్ బ్రిడ్జిల వద్ద పోలీసు సిబ్బందిని నియమించాలని అన్నారు.

అంటువ్యాధులు ప్రబలకుండా, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న వర్షాలకే బ్యాక్ వాటర్ వచ్చే ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి శాశ్వత పరిష్కారంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్‌‌తోపాటు జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.