పేదల సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పేదల సమస్యలపై  చిత్తశుద్ధితో పనిచేస్తున్నం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • కొల్లూర్‌‌‌‌ డబుల్‌‌‌‌ బెడ్రూం ఇండ్ల వద్ద ఇబ్బందులను తీరుస్తాం
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి 

రామచంద్రాపురం, వెలుగు : నిరుపేదల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. మంత్రి అజారుద్దీన్, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డితో కలిసి ఆదివారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌‌‌‌ డబుల్‌‌‌‌ బెడ్రూం కాలనీలో పర్యటించారు. 

ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్‌‌‌‌ కొల్లూరి భరత్‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. డబుల్‌‌‌‌ బెడ్రూం కమ్యూనిటీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొల్లూరులో 16 వేల కుటుంబాలకు చెందిన 48 వేల మంది నివసిస్తున్నారని, వారం కింద ఇచ్చిన హామీ మేరకు కాలనీలో 10 రేషన్‌‌‌‌ షాపులు ప్రారంభించామని తెలిపారు.

 ఆర్టీసీ బస్‌‌‌‌ సౌకర్యం కల్పించడంతో పాటు శాశ్వత పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌, హాస్పిటల్‌‌‌‌ నిర్మాణానికి శంఖుస్థాపన చేశామని, అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌‌‌‌లు సైతం అందించామని చెప్పారు. కాలనీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, వృద్ధులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం కాలనీవాసులు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొల్లూరు కమ్యూనిటీలో నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్‌‌‌‌ ఓటర్లంతా ఆలోచించి ఓటు వేయాలని, బీసీ బిడ్డను ఆదరించి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.