జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం..అక్రెడిటేషన్ల జారీలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తం: పొంగులేటి 

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం..అక్రెడిటేషన్ల జారీలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తం: పొంగులేటి 
  • ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల మంజూరులో సానుకూల నిర్ణయాలుంటాయన్న మంత్రి

బషీర్​బాగ్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బషీర్‌‌‌‌బాగ్ సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన -ఇఫ్తార్ లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల విషయంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అక్రెడిటేషన్ కమిటీలో జర్నలిస్టుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

ఇండ్ల స్థలాల కేటాయింపు, హెల్త్ కార్డుల మంజూరు వంటి అంశాల్లో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్రెడిటేషన్ కార్డుల జారీలో కానీ అక్రెడిటేషన్ కమిటీ ఏర్పాటులో కానీ జర్నలిస్టుల అందరి సలహాలు సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, సుల్తాన్ ఉల్ ఉలూమ్ విద్యాసంస్థల సెక్రటరీ జఫర్ జావేద్, పిస్తా హౌస్ సీఈఓ ఎం.ఏ.మజీద్, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.రామనారాయణ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు ఎం.ఏ. మజీద్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ మొహియుద్దీన్, టీయూడబ్ల్యూజే నేతలు పాల్గొన్నారు.