ఎవరు ఎవరి తాట తీస్తరో త్వరలోనే తెలుస్తది : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

ఎవరు ఎవరి తాట తీస్తరో త్వరలోనే తెలుస్తది : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి
  • కేసులో ఎంత తురుంఖాన్లున్నా వదిలిపెట్టేది లేదు
  • బీఆర్​ఎస్​ దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తం
  • వాళ్ల హయాం నుంచే నీటి కొరత మొదలైంది
  • దీనిపై సెప్టెంబర్‌‌‌‌లోనే  త్రీమెన్​ కమిటీ రిపోర్ట్​ ఇచ్చిందని వెల్లడి
  • గులాబీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదు : మంత్రి శ్రీధర్​బాబు
  • తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్​లో తనపై ఆరోపణలు చేస్తే మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా తాట తీస్తామంటూ బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. ‘‘ఎవరు ఎవరి తాట తీస్తారో త్వరలోనే తేలుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌‌‌‌ఎస్ తాటా తీశారు. కర్రుకాల్చి వాత పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఆ పార్టీ తాటా తీసేందుకు, రెండు కర్రులు కాల్చి వాతలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అని హెచ్చరించారు.

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తమ అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, తన డ్రైవర్ల ఫోన్లను, వారి కింద పనిచేసే వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని పొంగులేటి తెలిపారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద మనిషి ఉన్నా, ఎంత తురుంఖాన్లు ఉన్నా శిక్ష తప్పదని స్పష్టం చేశారు.  ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్​ తెలంగాణ జన జాతర సభ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్‌‌‌‌బాబుతో కలిసి పొంగులేటి బుధవారం పరిశీలించారు. అనంతరం అక్కడే ఇద్దరు మంత్రులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌‌ పార్టీ కరువును తెచ్చిందంటూ బీఆర్‌‌‌‌ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.

అధికారంలో ఉన్నన్ని రోజులు అడ్డగోలు దోపిడీ చేసి, ఇప్పుడు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్​ నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగు, తాగు నీటి కొరత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభమైందని అన్నారు. రాష్ట్రంలో నీటి కొరత రాబోతున్నదని సెప్టెంబర్‌‌‌‌లోనే త్రీ మెన్ కమిటీ నివేదిక ఇచ్చిందని, ఆ కమిటీని నియమించింది కూడా అప్పటి బీఆర్​ఎస్​ సర్కారేనని తెలిపారు. కమిటీ నివేదికను ఆయన బయటపెట్టారు. “ రాష్ట్రంలో వర్షాలు తక్కువ ఉన్నాయని, నీటి సమస్య రాబోతుందని గతేడాది సెప్టెంబర్‌‌‌‌లో బీఆర్‌‌‌‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే త్రీ మెన్ ఎక్స్‌‌పర్ట్స్ కమిటీ, కేఆర్‌‌‌‌ఎంబీ కమిటీ రిపోర్టులు ఇచ్చాయి.

అక్టోబర్ 6, 7, 9వ తేదీల్లో మరో మూడు రిపోర్టులు ఇచ్చాయి. ఈ ఏడాది 56 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని రిపోర్ట్‌‌లో పేర్కొన్నాయి.  గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతంలో 14 రిజర్వాయర్లలో నీళ్లు తక్కువగా ఉన్నాయని, తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందని పేర్కొన్నాయి. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించాయి. ఈ విషయాన్ని బీఆర్‌‌‌‌ఎస్ మీడియాలో కూడా బ్యానర్ కింద రాశారు.

ఈ విషయాన్ని బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు మరిచిపోయారా?”అని మంత్రి పొంగులేటి నిలదీశారు. ‘‘నాడే ఏర్పడిన కొరతను, ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద తోసేస్తున్నారు. బీఆర్​ఎస్​ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే.. బ్యారేజీలోని నీటిని ఆ ప్రభుత్వమే సముద్రంలోకి వదిలేసింది” అని తెలిపారు. ‘‘మిషన్ భగీరథ అద్భుతమైన ప్రాజెక్టు అంటూ బీఆర్‌‌‌‌ఎస్ చెప్తున్నది.

అదే నిజమైతే మార్చిలోనే నీటి కరువు ఎందుకొచ్చింది?” అని ప్రశ్నించారు. తాగునీటి వ్యవస్థను నాశనం చేసి, వేల కోట్లు దోచుకోవడానికి మిషన్ భగీరథను తీసుకొచ్చారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలు, అవినీతి వ్యవహారాలను ఇప్పటికే శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందుంచామన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు రెండు కమిషన్లను నియమించామని తెలిపారు. గత బీఆర్​ఎస్​ హయాంలో దోచుకున్న ప్రతి పైసాను కక్కించి ప్రజల కోసం ఖర్చు చేయడమే తమ లక్ష్యమని పొంగులేటి స్పష్టం చేశారు. 

రుణమాఫీ చేసి చూపిస్తం

ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని,  ఏడాదికి 4.5 లక్షల ఇండ్లను కట్టిస్తామని చెప్పారు. ‘‘కరప్షన్‌‌కు మారుపేరైన మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు కాంగ్రెస్‌‌ వైపు వేలు చూపిస్తున్నారు. ఒక్క వేలు మా వైపు చూపితే నాలుగు వేళ్లు వాళ్ల వైపు చూపుతున్నాయి. చివరికి పేదలకు ఇచ్చే సీఎంఆర్‌‌‌‌ఎఫ్  చెక్కులను కూడా దోచుకున్న ఘనత గత ప్రభుత్వ పెద్దలకు దక్కుతుంది.

ఎండిన పంటలకు ఒక్క రూపాయి అయినా పరిహారం ఇచ్చిన చరిత్ర బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఉన్నదా?” అని ప్రశ్నించారు. ఎలక్షన్లు రాగానే కేసీఆర్​ బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో సభ పెట్టి ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటించారని, ప్రజలు కాంగ్రెస్‌‌ను ఆశీర్వదించారని పొంగులేటి తెలిపారు.

ఈసారి జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఇక్కడ్నుంచే విడుదల చేస్తున్నామన్నారు. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే సభకు ఏఐసీసీ చీఫ్​  మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర జాతీయ నాయకులు వస్తున్నారని వెల్లడించారు.  దేశంలో కాంగ్రెస్ సర్కార్ రాబోతున్నదని, జూన్ 6న దేశానికి ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణం చేస్తారని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. 

ఆర్థిక వ్యవస్థను ఆగం చేసిన్రు : శ్రీధర్‌‌‌‌బాబు

గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు అన్నారు. అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుని పల్లెలు, పట్టణాలకు నీళ్లు ఇచ్చేందుకు యాభై ఏండ్ల పాలనలో కాంగ్రెస్ నిర్మించిన వ్యవస్థను బీఆర్‌‌‌‌ఎస్ ధ్వంసం చేసిందని అన్నారు. పాత వ్యవస్థను ధ్వంసం చేసి, మిషన్ భగీరథ పేరిట వేల కోట్లు ఖర్చు చేసి ఒక్కటో, రెండో బిందెల నీళ్లు ఇచ్చారని ఆయన మండిపడ్డారు.

కరువును సృష్టించారంటూ బాధ్యతలేని ఆరోపణలు చేయడం మానుకోకపోతే, ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్‌‌‌‌ఎస్‌‌కు రాదని అన్నారు. ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే ట్యాంకర్లు పెట్టయినా నీళ్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ చేస్తున్న విమర్శలపై శ్రీధర్​బాబు మండిపడ్డారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే..ఫోన్ ట్యాపింగ్‌‌కు పాల్పడిన వారిపై టెలిగ్రాఫ్​ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సుమోటోగా కేంద్ర ప్రభుత్వం కేసు టేకప్ చేసి ఎంక్వైరీ చేయొచ్చని సూచించారు.