- నిర్వహించననున్న మంత్రి పొంగులేటి
- తొలిరోజు నిజామాబాద్, ఆదిలాబాద్ అధికారులతో భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రెవెన్యూ అంశాలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. హిమాయ త్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు ఉదయం ఉమ్మడి నిజామాబాద్, మధ్యాహ్నం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గాల వారీగా సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొదటి విడతలో మంజూరు చేసిన 3.5 లక్షల ఇండ్ల పురోగతిపై సమీక్షిస్తారు. రెండో విడత ఇండ్ల మంజూరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, భూధార్, సర్వే మ్యాప్‌ల వంటి కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆయా జిల్లాల ఇన్-చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ అధికారులు పాల్గొంటారు.

