టెక్నికల్​గా అవిశ్వాసానికి నో చాన్స్

టెక్నికల్​గా అవిశ్వాసానికి నో చాన్స్
  • బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లను సంక్షేమంతో తిప్పికొట్టాలి
  • అవిశ్వాస తీర్మానాన్ని పెద్దగా పట్టించుకోవద్దు
  • మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్​బాబు సూచన
  • బల్దియా కౌన్సిల్​ మీటింగ్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
  • హాజరైన మేయర్, ఇద్దరు కార్పొరేటర్లు  
  • ఇయ్యాల మరోసారి మొత్తం కార్పొరేటర్లతో మీటింగ్


హైదరాబాద్ సిటీ, వెలుగు:నేడు జరిగే బల్దియా కౌన్సిల్​మీటింగులో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం మినిస్టర్ క్వార్టర్స్ లో హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా ఇన్​చార్జి మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు. మేయర్​తో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు, కాంగ్రెస్​పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బీఆర్ఎస్​కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం అంశాన్ని కావాలనే తీసుకొస్తున్నారని, ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దన్నారు. టెక్నికల్ గా అందుకు అవకాశమే లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులను ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ఎదుర్కోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రేటర్ లో జరిగిన అభివృద్ధి, కేటాయించిన నిధుల అంశాల పై కౌన్సిల్ లో చర్చించాలని, కాంగ్రెస్ కార్పొరేటర్లంతా ఒకేతాటిపై నిలబడాలన్నారు.

ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీగణేశ్, ప్రకాశ్​గౌడ్, ​మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్​పార్టీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్​రెడ్డి పాల్గొన్నారు. కాగా, గురువారం ఉదయం 8 గంటలకు మినిస్టర్ క్వార్టర్స్ లోని కాంగ్రెస్ కార్పొరేటర్లతో మంత్రులు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. అందులోనూ ఇదే అంశంపై దిశానిర్దేశంచేయనున్నారు. 

కౌన్సిల్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి..

బల్దియా హెడ్డాఫీసులోని కౌన్సిల్ హాల్ లో 2025–-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్  సమావేశం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం ఉదయం 10–30 గంటలకు ప్రారంభంకానుంది. ఇందులో మేయర్ ప్రసంగంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. లంచ్ వరకు బడ్జెట్ పైనే చర్చ జరుగుతుంది. లంచ్ తరువాత ప్రశ్నోత్తరాలపై చర్చించనున్నారు.

సభ్యులు సహకరిస్తే సమావేశం సాఫీగా జరగనుంది. లేకపోతే వాయిదా పడే అవకాశముంది. బీఆర్ఎస్​, బీజేపీ కార్పొరేటర్లు  ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉండడంతో బల్దియా హెడ్డాఫీస్​ఆవరణలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.