- చిక్కడపల్లి – దోమలగూడ లింక్ బ్రిడ్జి ఓపెన్
ముషీరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్సేన్ సాగర్ సర్‌ప్లస్ నాలాపై జీహెచ్ఎంసీ నిధులతో రూ.6 కోట్ల ఖర్చుతో నిర్మించిన చిక్కడపల్లి – దోమలగూడ లింక్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనంతో విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా మారిందని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, పార్కులు తదితర అవసరాలపై ప్రభుత్వం ప్రాధాన్యతతో పనిచేస్తోందన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో నగరానికి మెరుగైన సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. కొత్త లింక్ బ్రిడ్జితో చిక్కడపల్లి నుంచి దోమలగూడకు ప్రయాణం సులభం అవుతుందని అధికారులు తెలిపారు. లిబర్టీ – సెక్రటేరియట్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్యలు, దూరం రెండూ తగ్గనున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్ రవికిరణ్, కార్పొరేటర్ రచన తదితరులు పాల్గొన్నారు.
