కమర్షియల్ సిలిండర్లు దొరక్క అల్లాడిపోతున్న హోటల్స్, రెస్టారెంట్లకు కేంద్రం గుడ్ న్యూస్

కమర్షియల్ సిలిండర్లు దొరక్క అల్లాడిపోతున్న హోటల్స్, రెస్టారెంట్లకు కేంద్రం గుడ్ న్యూస్

కమర్షియల్ సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న హోటల్స్, రెస్టారెంట్ల యాజమాన్యాలకు శుభవార్త. కేంద్రం మార్చి 23 నుంచి కమర్షియల్ ఎల్పీజీని మరో 20 శాతం అదనంగా రాష్ట్రాలకు కేటాయించనుంది. దీంతో.. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ 50 శాతానికి చేరింది. ఈ అదనంగా సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కేటాయింపులో హోటల్స్, రెస్టారెంట్స్, దాబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

మార్చి 23 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కమర్షియల్ సిలిండర్లు దొరక్క చాలా నగరాల్లో, పట్టణాల్లో కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ మూతబడ్డాయి. ఒకవేళ కట్టెల పొయ్యిలతో నడుస్తున్నా.. ఫుడ్ ఐటమ్స్ రేటు పెంచేసి.. అదనపు రేట్లతో కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి. కేంద్రం తాజా ప్రకటనతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు.

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో చమురు సంక్షోభం నెలకొంది. ఈ ప్రభావం ఇండియాలో ఫుడ్ సెక్టార్పై తీవ్రంగా పడింది. హైదరాబాద్ సిటీలో రెస్టారెంట్స్, హోటల్స్ పరిస్థితి దారుణంగా ఉంది. నగరంలో చిన్న టీ, టిఫిన్ సెంటర్ల నుంచి మొదలుకుంటే అన్ని రకాల రెస్టారెంట్ల వరకు దాదాపు 70 వేల వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఈ రంగంలో కోట్ల రూపాయల ఫుడ్​బిజినెస్​జరుగుతోంది. గ్యాస్​కొరత కారణంగా నగరంలో ఈ హోటళ్లు ఒక్క రోజు మూసివేస్తే సుమారు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆదాయం కోల్పోయే అవకాశాలున్నాయి. ఇప్పటికే గ్యాస్​షార్టేజీతో ప్రతి హోటల్ మెనూ తగ్గించడంతో రూ. లక్షల్లో ఆదాయం కోల్పోతున్నాయి.

హోటళ్లు వంట చేయలేకపోతే ఆన్​లైన్ ఫుడ్ ఆర్డర్లు కూడా తగ్గిపోతాయి. నగరంలో కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హోటళ్లలో వంట కార్యకలాపాలు తగ్గిపోయాయి. ముఖ్యమైన మెనూ మాత్రమే అందుబాటులో ఉండడంతో ఫుడ్ డెలివరీ ఆర్డర్లు కూడా గణనీయంగా పడిపోయాయి. దీంతో జొమోటో, స్విగ్గీ, వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్ ఆదాయం తగ్గింది.