హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే రెండు మూడు గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్తో పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసి హెచ్చరించింది. మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం, గంటకు 41 - 61 కి.మీ.ల మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో (గాలులు వీచే) మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్, జనగాం, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం, గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ (గాలులలో) తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో వడగండ్ల వానలు రైతులకు భారీ నష్టం చేసింది.
నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో గురువారం అర్ధరాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మోస్రా, చందూర్, పోతంగల్, రుద్రూర్, వర్ని, సాలూరా, భీంగల్, సిరికొండ, జక్రాన్‌పల్లి మండలాల్లో ఈదురుగాలులకు తోడు వడగండ్లు పడడంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వడగండ్ల వాన కారణంగా జిల్లా వ్యాప్తంగా 3,45 0ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 2,740 ఎకరాల్లో వడ్లు రాలిపోగా, 690 ఎకరాల్లో మక్క, 20 ఎకరాల్లో జొన్న పంట దెబ్బతింది. అమ్మడానికి కల్లాల్లో రెడీగా ఉన్న ఎర్రజొన్న, ఉడికించి ఆరబెట్టిన పసుపు మొత్తం వర్షంలో తడిసిపోయింది.
