‘ధురంధర్2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంటే.. ఈ పాక్ పొలిటీషియన్కు మాత్రం భయంతో కాళ్లూచేతులూ వణికేలా చేసింది. ఈ పొలిటీషియన్ పేరు నబిల్ అహ్మద్ ఖాన్ గాబోల్. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ఒక పొలిటీషియన్. ధురంధర్ సినిమాలో పొలిటీషియన్ జమీల్ జమాలి పాత్ర నబిల్ గాబోల్ను పోలి ఉంది. ధురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయినప్పటి నుంచి తనను జమీల్ జమాలి అని పిలుస్తున్నారని నబీ గాబోల్ కొన్ని ఇంటర్వ్యూల్లో చెబుతూ తెగ సంబరపడ్డాడు.
కానీ.. ‘ధురంధర్.. ది రివేంజ్’ సినిమా ముగింపులో జమీల్ జమాలి పాత్రను కూడా ఇండియన్ స్పైగా చూపించారు. పాకిస్తాన్ వెళ్లి రాజకీయాల్లో ఎదిగిన ఒక ఇండియన్ ఏజెంట్గా చూపించారు. అంతేకాదు.. దావూద్ ఇబ్రహీంతో చేతులు కలిపి దావూద్ను బతికి ఉండగానే జీవచ్ఛవం చేసిన ఇండియన్ ఏజెంట్గా జమీల్ జమాలి పాత్రకు జస్టిఫికేషన్ ఇచ్చారు. దీంతో.. నిన్నమొన్నటి దాకా నబిల్ గాబోల్ను జమీల్ జమాలి అని పిలిచిన పాక్ పబ్లిక్ అతని వైపు అనుమానంగా చూస్తున్నారు.
పాక్ పొలిటీషియన్లు, నిఘా వర్గాలు నబిల్ గాబోల్ను ఇండియన్ ఏజెంట్ ఏమోననే సందేహంలో పడ్డాయి. తనను పాక్ ఆర్మీ తీసుకెళ్లి భారత గూఢచారిననే అనుమానంతో విచారణ చేసినా ఆశ్చర్యం లేదని నబిల్ గాబోల్ చెప్పుకొచ్చారు. అయితే.. వాస్తవానికి నబిల్ గాబోల్ నిజ జీవితంలో ఇండియన్ స్పై కానే కాదు. ‘ధురంధర్.. ది రివేంజ్’ సినిమాలో చూపించిన పాకిస్తాన్లోని ల్యారీలోనే నవంబర్ 16, 1962లో నబిల్ గాబోల్ పుట్టారు. అతని తాతయ్య పాక్ పొలిటీషియన్. అతని అంకుల్ అబ్దుల్ సత్తార్ గాబోల్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు.
2002 నుంచి 2024 వరకూ నబిల్ గాబోల్ నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పాకిస్తాన్ సభ్యుడిగా కొనసాగారు. పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ల్యారీలో గ్యాంగ్స్టర్లను ప్రోత్సహించారని, పెంచి పోషించారని పేరు కూడా గాబోల్కు ఉంది. ఇక.. నబిల్ గాబోల్ రీల్ పాత్రను.. అదేనండీ ‘ధురంధర్’ సినిమా రెండు భాగాల్లో జమీల్ జమాలి పాత్రను పోషించిన నటుడికి చాన్నాళ్ల తర్వాత సరైన గుర్తింపు దక్కింది. ఈ పాత్ర పోషించిన నటుడి పేరు రాకేష్ బేడీ.
1976లోనే సినిమాల్లో నటిస్తూ వచ్చిన రాకేష్ బేడీకి ‘ధురంధర్’ ఫ్రాంచైజీలో సరైన పాత్ర దక్కింది. ‘ధురంధర్’ ది రివేంజ్ సినిమా రాకేష్ బేడీకి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. అతని పాత్రను సినిమా ముగింపులో ఒక ఇండియన్ స్పై ఏజెంట్గా దర్శకుడు చూపించడమే ఇందుకు కారణం. గమ్మత్తైన విషయం ఏంటంటే.. రీల్ లైఫ్ క్యారెక్టర్ చేసిన రాకేష్ బేడీ చాన్నాళ్ల తర్వాత సరైన పాత్ర పడిందని ఫేమ్ను ఎంజాయ్ చేస్తుంటే.. రియల్ లైఫ్లో ఈ క్యారెక్టర్ను పోలి ఉన్న నబిల్ గాబోల్ భయంతో బెంబేలెత్తిపోతున్నారు.
