హంతకులే సంతాప సభ పెట్టినట్టుంది.. కేటీఆర్​కు మంత్రి పొన్నం కౌంటర్

హంతకులే సంతాప సభ పెట్టినట్టుంది.. కేటీఆర్​కు మంత్రి పొన్నం కౌంటర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్, బీజేపీ ఎంపీ బండి సంజయ్​లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్​ఇచ్చారు. సర్పంచుల పెండింగ్​బిల్లులపై కేటీఆర్​కు, సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై సంజయ్​కు గురువారం చురకలు అంటించారు. ఇటీవల సిరిసిల్ల సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సర్పంచుల పెండింగ్​బిల్లులపై గళం విప్పుతానని చెప్పారు. ఆ వార్త క్లిప్​ను ‘ఎక్స్’లో పోస్ట్​చేసిన పొన్నం ప్రభాకర్.. హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా కేటీఆర్​వ్యవహారం ఉందని విమర్శించారు. ‘‘హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా ఉంది. పదేండ్ల మీ పాలనలో పెండింగ్​బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నది నిజం కాదా? పనుల సాకు చూపించి మీ పాలనలో సర్పంచులను పదవి నుంచి సస్పెండ్​చేసి వేధించింది నిజం కాదా? ఇప్పుడు మళ్లీ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు కేటీఆర్. మీ హయాంలోనే రూ.1,100 కోట్ల బిల్లులు పెండింగ్​పెట్టారు. 20 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు’’ అని కేటీఆర్ పై పొన్నం ఫైర్ అయ్యారు. 

నేతన్నలను ఆదుకుంటం.. 

సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలంటూ సీఎం రేవంత్​రెడ్డికి బండి సంజయ్​లేఖ రాయగా, ఆయనకు కూడా పొన్నం కౌంటర్ ఇచ్చారు. ‘‘ముందు మీ మొసలి కన్నీరు ఆపి, మీరు చేయాల్సిన మొదటి బాధ్యతను నెరవేర్చండి. చేనేత కార్మికులపై భారాన్ని తగ్గించండి. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధిస్తున్నది. ముందు కేంద్ర ప్రభుత్వం ఆ జీఎస్టీని ఎత్తేసేలా చూడండి. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన చేనేత బోర్డును పునరుద్ధరించండి. చేనేత కార్మికుల బీమాను, రాయితీలను తిరిగి ప్రారంభించండి. సిరిసిల్లలో మెగా పవర్​లూమ్​క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్​లో ఉన్నాయి. ఇవన్నీ ఇట్లుంటే ‘మళ్లా ఆడలేక పాత గజ్జెలు’ అంటే ఎలా?” అని సంజయ్ కు పొన్నం చురకలు అంటించారు. ఎవరి సలహాలు అవసరం లేకుండా, చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పారు. 

గౌడ సామాజికవర్గ నేతలతో పొన్నం భేటీ..  

గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. గురువారం మండలి మాజీ చైర్మన్​స్వామిగౌడ్​ఇంటికి వెళ్లి, ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. అనంతరం అక్కడే రాజేంద్రనగర్​ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్​లతోనూ సమావేశమయ్యారు. గౌడ కుల ధార్మిక సంఘం గురించి రాజకీయ పార్టీలకు అతీతంగా చర్చించినట్టు పొన్నం తెలిపారు. అంతకుమించి అందులో రాజకీయాలేమీ లేవని స్పష్టం చేశారు. రాజకీయ చర్చలేవీ జరగలేదని స్వామిగౌడ్​కూడా పేర్కొన్నారు.