V6 News

తేజస్వి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి.. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మంత్రి పొన్నం లేఖ

తేజస్వి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి.. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మంత్రి పొన్నం లేఖ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ.. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల కుటుంబాలను అవమానపరిచేలా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆయన మాటలు తెలంగాణ ఉద్యమస్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని దుయ్యబట్టారు.

గురువారం గాంధీ భవన్ లో మీడియాతో పొన్నం మాట్లాడారు. తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తేజస్వి సూర్య వెంటనే తన మాటలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై అవహేళనగా మాట్లాడిన తేజస్వి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్​సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్టు చెప్పారు.

తేజస్వి మాటలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని లేఖలో కోరినట్టు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటును బీజేపీ ఎంపీ అవమానపరుస్తుంటే.. తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది ఆ పార్టీ ఎంపీలకు చీమూ, నెత్తురులేదా అని పొన్నం ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలను విని ఎంజాయ్ చేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే.. తెలంగాణ తల్లి రోదిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్రం  కోసం ఆత్మ త్యాగాలు చేసి.. ప్రజాస్వామికంగా చట్టాల ద్వారా రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.

ఇక నుంచి ఎవరైనా చులకనగా మాట్లాడితే.. బిడ్డా.. జాగ్రత్త’’ అంటూ పొన్నం హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు తెలంగాణ రక్తం ఉంటే.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మిగతా బీజేపీ ఎంపీలు తెలంగాణ బిడ్డలే అయితే.. తెలంగాణ తల్లిని అవమానపరుస్తుంటే చూస్తూ ఊరుకోవడం మంచిదేనా? అని నిలదీశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రధాని మోదీ కించపరుస్తూ మాట్లాడినా.. నోరు మెదిపితే మంత్రి పదవి నుంచి తొలగిస్తారేమోనని కిషన్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మౌనం వీడకుంటే తెలంగాణ తల్లికి ద్రోహం చేసినవారిగా మిగిలిపోతారని మండిపడ్డారు. మాజీ పార్లమెంట్ సభ్యులం.. త్వరలోనే నేరుగా స్పీకర్ ను  కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.  

డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ..

బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాత్రి డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాశారు. పార్లమెంట్ లో పాస్ అయిన బిల్లును ఇండియా.. పాకిస్తాన్ విభజనతో పోల్చి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అందులో పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు శాంతి, సామరస్యాన్ని దెబ్బతీస్తాయని, ప్రాంతీయ కలహాలను పెంచే ప్రమాదం ఉందని, వీటిని దృష్టిలో ఉంచుకొని తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా ఉండేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో డీజీపీని మంత్రి పొన్నం కోరారు.