- అందుకే బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టింది: మంత్రి పొన్నం
- ఆ పార్టీకి 10 వేల ఓట్లు కూడా రావు
- ఇక్కడ గెలిచేది కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవే
- తెలంగాణకు కేంద్రం, బీఆర్ఎస్ ఏం చేసిందో యూసఫ్‌గూడ చౌరస్తాలో చర్చ చేద్దామా?
- కిషన్ రెడ్డి, కేటీఆర్ నా సవాల్ స్వీకరిస్తారా?
- కవిత అడిగే ప్రశ్నలకు జవాబిచ్చాక బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడగాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించారు. అందుకే ఇక్కడ బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టిందని ఆరోపించారు. ఆ పార్టీకి 10 వేల ఓట్లు కూడా రావని అన్నారు. బీఆర్ఎస్ మైక్ కిషన్ రెడ్డి గొంతులో ఉందని ఎద్దేవా చేశారు. బుధవారం పొన్నం ప్రభాకర్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విద్యావంతుడని, అతన్ని రౌడీ అని విమర్శించడం బీఆర్‌ఎస్, బీజేపీకి తగదన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితమే ఇక్కడ పునరావృతం అవుతుందని చెప్పారు. ఓట్ చోరీపై మాట్లాడే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు ఎక్కడిదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో తీవ్రమైన ఆర్థిక విధ్వంసం జరగడంతోనే ఆటోవాలా పథకం పెండింగ్‌లో ఉందన్నారు. అయినా వారికి ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని స్పష్టం చేశారు.
చర్చకు వస్తరా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడిగే ముందు ఆ పార్టీ బహిష్కృత లీడర్, ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు జావాబులివ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణకు పదేండ్లలో బీఆర్‌ఎస్ సర్కార్ ఏం చేసింది?.. కేంద్రంలోని బీజేపీ ఏం చేసింది.. రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అనేది చర్చ చేద్దామా?’’ అని సవాల్ విసిరారు. యూసఫ్ గూడ చౌరస్తాలో చర్చకు రావాలని కిషన్ రెడ్డి, కేటీఆర్‌ను కోరారు. బీఆర్‌ఎస్ నేతలు చర్చ లేకుండా.. జనాన్ని తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘పుట్టిన ప్రతి బిడ్డ మీద రూ. 2 లక్షల అప్పు చేసింది మీరు.. అలాంటి మీకు కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ ప్రచారం చేసే అర్హతే లేదు” అని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి పొన్నం వ్యాఖ్యానించారు.
