80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  డిసెంబర్ 30వ తేదీ శనివారం ఉదయం ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి 80 కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే  కొనుగోలు చేశామని తెలిపారు. మహిళ ప్రయాణానికి ఇబ్బందులు రాకుండా అన్నీ చర్యలు తీసుకున్నామన్నారు. మహాలక్ష్మీ పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు చెప్పారు.  భవిష్యత్ లో ఆర్టీసీ నుంచి మరిన్ని రాయితీలు కల్పిస్తామని ఆయన చెప్పారు.

 కొత్తబస్సులో 30ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. కొత్త బస్సులు ఈ రోజు నుంచే అందుబాటులోకి రానున్నాయి.  ఈ ఆర్థిక ఏడాది రూ.400 కోట్ల వ్యయంతో వెయ్యి యాభై కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు టీఎస్ఆర్టీసీ  ప్రణాళిక సిద్ధం చేసింది. విడుతల వారీగా 2024 మార్చి నాటికి కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురానుంది.