- గ్లోబల్ సమిట్ ప్యానల్ చర్చలో మంత్రులు పొన్నం, అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట జనాభాలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీలకు నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘గ్లోబల్ సమిట్ – తెలంగాణ రైజింగ్ విజన్-2047’లో సంక్షేమ శాఖల పాత్రపై నిర్వహించిన ప్యానల్ చర్చలో గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మైనార్టీ సంక్షేమ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి పొన్నం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల విజన్-2047లో నాణ్యమైన విద్య, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నదన్నారు. గ్లోబల్ సమిట్‌లో వచ్చిన మేధావుల సలహాలు, సూచనలను స్వీకరించి కార్యాచరణలోకి తీసుకొస్తామన్నారు.
విద్యలో సమూల సంస్కరణలు చేపడుతున్నామని, డైట్ చార్జీలు పెంచి విద్యార్థులకు మెరుగైన భోజనం అందిస్తున్నామన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఉన్నత చదువులు చదివిన కుటుంబాలు మాత్రమే ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరాయని కులగణన నివేదికలో తేలింది” అని మంత్రి వివరించారు.

