భక్తులకు గుడ్ న్యూస్.. మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు ..

భక్తులకు గుడ్ న్యూస్.. మేడారం నుంచి  నిమిషానికి 4 బస్సులు ..

హైదరాబాద్, వెలుగు: మేడారంలో దర్శనం చేసుకున్న వెంటనే భక్తులు ఇంటికి తిరుగుముఖం పట్టేందుకు ప్రతి నిమిషానికి నాలుగు బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు చేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంగళవారం ఆయన సెక్రటేరియెట్ లో మేడారం జాతర ఏర్పాట్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ఈసారి 20 లక్షల మంది ఆర్టీసీ బస్సు్ల్లో మేడారం జాతరకు వస్తారని అంచనా వేశామన్నారు. అందుకు తగ్గట్టుగానే 4 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ రూట్లలో బస్సులను ఎక్కువగా నడుపుతామని వివరించారు. రాబోయే రోజుల్లో మేడారంలో శాశ్వతంగా ఆర్టీసీ బస్​స్టేషన్​నిర్మించేలా కార్యాచరణ  రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 51 ఆర్టీసీ బస్సు పాయింట్ లను ఏర్పాటు చేశామని..భక్తుల సమస్యలను పరిష్కరించడానికి 10 వేల మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. బస్సులు ఎక్కేందుకు 50 క్యూ లైన్ లను 9 కిలో మీటర్ల మేర ఏర్పాటు చేశామన్నారు. 50 ఎకరాల్లో ఒకేసారి వెయ్యి బస్సులు పార్కింగ్ చేసేలా వసతులు కల్పించామని తెలిపారు. విధుల్లో 7 వేల మంది డ్రైవర్లు, 1800 మంది కండక్టర్లు ఉంటారని వివరించారు. 

బస్సులు మేడారం నుంచి వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటాయనే 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. మహిళల ఫ్రీ బస్సు పథకంతో 90 కిపైగా డిపోలు లాభాల బాటలో ఉన్నాయన్నారు. విజన్ 2047లో భాగంగా బస్సుల సంఖ్యను మరింత పెంచుతామని చెప్పారు. హై‌‌‌‌‌‌‌‌దరాబాద్ సిటీలో ఈవీ బస్సుల సంఖ్య పెరగనున్నందున ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు పొన్నం పేర్కొన్నారు. సమావేశంలో రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.