సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అధికారికంగా నిర్వహిస్తం : మంత్రి పొన్నం

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అధికారికంగా నిర్వహిస్తం : మంత్రి పొన్నం

బషీర్ బాగ్, వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్టు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నెల 18న ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్టు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో  మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ, జైగౌడ్ ఉద్యమం జాతీయ కమిటీల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374వ జయంతి జాతీయ వారోత్సవాలు జరిగాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వట్టికూటి రామారావు గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో పొన్నం మాట్లాడారు.

 మరో రెండ్రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో అర్హులైన తాళ్లెక్కే వారికి సేఫ్టీమోకులు అందించబోతున్నామని తెలిపారు. అలాగే, మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా 50% తాటి  మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారని చెప్పారు. కల్లు దుకాణాలను బార్ అండ్ రెస్టారెంట్ తరహాలో ఆధునికంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో ఉన్నామన్నారు. ట్యాంక్ బండ్​పై త్వరలోనే సర్దార్ పాపన్న మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని  మంత్రి పొన్నం తెలిపారు. 

బహుజన రాజ్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. నిజాం పాలకులు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల అభ్యున్నతికి కృషి చేశారని, ఆయన బాటలో బహుజనులు, గౌడ కులస్తులు నడవాలని పిలుపునిచ్చారు. ఈ  కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , జోగి రమేశ్‌, బీజేపీ సీనియర్ నాయకులు తూళ్ల వీరేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఓవర్సీస్ స్కాలర్ షిప్ బకాయిలు రిలీజ్ చేస్తం

హైదరాబాద్, వెలుగు: ఓవర్సీస్ స్కాలర్ షిప్ గతేడాది బకాయిలు, ఈ ఏడాదివి కలిపి అంతా త్వరలోనే రిలీజ్ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్టూడెంట్స్, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సూచించారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్​కు స్టూడెంట్స్ ఎంపిక ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైందని, గతంలో ఏడాదికి 300 మందికి ఇచ్చేవారని చెప్పారు. 

స్కాలర్​షిప్​ల సంఖ్యను డబుల్ లేదా త్రిబుల్ చేయాలనే అంశాన్ని సర్కారు పరిశీలిస్తుందని, ఈ ప్రతిపాదనకు సీఎం, డిప్యూటీ సీఎం, కేబినెట్ అంతా అంగీకరించారని పేర్కొన్నారు. ఓవర్సీస్ స్కాలర్​షిప్​కు స్టూడెంట్స్ ఎంపిక పక్రియ పూర్తయిందని, గతేడాదికి సంబంధించి మొదటి దశ ఆర్థిక సహాయం అందుకున్న వారికి రెండో దశ పేమేంట్​కు సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ ఉందని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.