రైలు పట్టాలు కోసేయాలనడం ఉన్మాదం.. బాల్క సుమన్పై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

రైలు పట్టాలు కోసేయాలనడం ఉన్మాదం.. బాల్క సుమన్పై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
  • బీఆర్ఎస్ అధిష్టానం సుమన్​ను పార్టీ నుంచి బహిష్కరించాలి
  • ఆర్టీసీలో త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు, విలీన ప్రక్రియ ఉంటుందని వెల్లడి
  • హుస్నాబాద్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ బ్రోచర్ విడుదల చేసిన మంత్రి 

హైదరాబాద్, వెలుగు: రైలు పట్టాలు కోసేయాలని, సింగరేణి భవనాన్ని తగలబెట్టాలని మాజీ ఎంపీ బాల్క సుమన్‌‌‌‌‌‌w‌‌‌‌‌‌ పిలుపునివ్వడం రాజకీయ ఉన్మాదానికి పరాకాష్ట అని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సుమన్ వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయాలని, చెన్నూరు కాంగ్రెస్ నాయకులు ఆ వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. విధ్వంసకర వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న సుమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటనే బీఆర్ఎస్ అధిష్టానం  పార్టీ నుంచి బహిష్కరించాలని అన్నారు. 

బుధవారం సెక్రటేరియెట్​లో మీడియాతో మంత్రి మాట్లాడారు. పదేండ్లపాటు అధికారంలో ఉండి, కేవలం రెండున్నరేండ్లు విపక్షంలో ఉండేసరికే ఇంత అసహనానికి గురై దేశ జాతీయ సంపదను ధ్వంసం చేయమనడం దారుణమన్నారు. రైతుల ధర్నాకు ఐదుగురు రైతులు కూడా రాలేదని సుమనే స్వయంగా ఒప్పుకుంటూ, పార్టీ నేతలతో విధ్వంసానికి ఉసిగొల్పడంపై బీఆర్ఎస్ అధిష్టానం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీసీ సమస్యలు, విలీనంపై మంత్రి పొన్నం స్పష్టతనిచ్చారు. 

త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికైన ప్రతినిధులు, అధికారులతో కమిటీ వేసి విలీన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. పొరుగు రాష్ట్రమైన ఏపీలో విలీనం తర్వాత వచ్చిన సమస్యలను అధ్యయనం చేసి, భవిష్యత్తులో ఇక్కడి ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పక్కాగా విలీనం చేస్తుందని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడినందుకు తొలగించిన డ్రైవర్ ఆర్టీసీ ఉద్యోగి కాదని, ఆయన ఒక హైర్ బస్ డ్రైవర్ అని తెలిపారు. స్థానిక నేతల లేఖతో తొందరపడి చర్యలు తీసుకున్న డిపో మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బదిలీ చేశామని, ఆ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యాజమాన్యానికి ఆదేశాలిచ్చామని మంత్రి స్పష్టం చేశారు. 

  • ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్ల కోసం మంత్రి వినూత్న ప్రచారం

హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రైవేట్ విద్యాసంస్థల తరహాలో బ్రోచర్లు విడుదల చేసి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రభుత్వ కాలేజీ కోడ్ ‘ఎస్​యూసీఈ’ అని, విద్యార్థులు ఈ కాలేజీని ఎంచుకోవాలని కోరారు. బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 కోర్సులను అందుబాటులోకి తెచ్చామని, ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉన్నాయని వివరించారు. ఉన్నతమైన ప్రమాణాలు, అత్యుత్తమ హాస్టల్ వసతి కలిగిన ఈ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.