యాక్సిడెంట్లు నివారించి డెత్ రేట్ తగ్గించండి .. పాసింగ్ ఔట్ పరేడ్ కు హాజరైన మినిస్టర్

యాక్సిడెంట్లు నివారించి డెత్ రేట్ తగ్గించండి ..  పాసింగ్ ఔట్ పరేడ్ కు హాజరైన మినిస్టర్
  • కొత్త ఏఎంవీఐలకు మంత్రి పొన్నం సూచన

గంపిపేట్, వెలుగు: రవాణా శాఖలో కొత్తగా విధుల్లోకి చేరిన వారు రోడ్డు ప్రమాదాలను నివారించి డెత్​ రేటును తగ్గించేలా కృషి చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​సూచించారు. రాజ బాహదూర్ వెంకటరామిరెడ్డి(ఆర్బీబీఆర్ఆర్) తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన 96 మంది ఏఎంవీఐల పాసింగ్ ఔట్ పరేడ్  కార్యక్రమం  బుధవారం జరిగింది. పొన్నం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రవాణా శాఖలో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పటికే 113 ఏఎంవీఐ, 54 రవాణా కానిస్టేబుళ్లు, 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ప్రక్రియ పూర్తయిందన్నారు. నాలుగు నెలల ట్రైనింగ్​ తర్వాత  96 మంది ఏఎంవీఐలు విధుల్లో చేరుతున్నారని చెప్పారు.

 రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ఏఐ టెక్నాలజీతో వెహికల్ ఫిట్నెస్ చూస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందన్నారు. ఇప్పటికే విధుల్లో ఉన్న సిబ్బందికి రెండు నెలల చొప్పున ట్రైనింగ్​ ఇవ్వనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఈవీ, సీఎన్ జీ, ఎల్ పీజీ వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, తెలంగాణ పోలీస్ అకాడమీ  డైరెక్టర్ అభిలాష బిస్తి, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్  పాల్గొన్నారు.