ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో మంత్రి పొన్నం మీటింగ్ .. జులై 15 లోపు జిల్లా కార్యవర్గం పూర్తికి కసరత్తు

ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో  మంత్రి పొన్నం మీటింగ్ ..  జులై 15 లోపు జిల్లా కార్యవర్గం పూర్తికి  కసరత్తు

సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్  మంగళవారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ముఖ్య నేతలు, పీసీసీ  నియమించిన పార్లమెంట్ ఇన్​చార్జిలు, జిల్లా పార్టీ అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 15 లోపు గ్రామ, మండల, జిల్లా నూతన కార్యవర్గాలను పూర్తి చేసేలా కసరత్తు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే గ్రామ , మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గానికి సంబంధించి అప్లికేషన్లు తీసుకున్న ఆశావహుల జాబితాపై స్థానిక ఎమ్మెల్యేలు ,పార్టీ ముఖ్య నేతలు, జిల్లా అబ్జర్వర్ల సమక్షంలో తుది జాబితా ఫైనల్ చేయాలని నిర్ణయించారు.  ఏఐసీసీ ఆదేశాల మేరకు జిల్లా నూతన కార్యవర్గంలో యువత కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మహిళలకు పెద్ద పీట వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. 

సామాజిక సమీకరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నూతన కార్యవర్గంలో అవకాశం కల్పించాలని నిర్ణయించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం మెదక్ , సంగారెడ్డి ,సిద్దిపేట జిల్లాలో ఈనెల 11 తర్వాత పర్యటిస్తానని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం మెదక్ జిల్లా ముఖ్య నేతలు,10 నియోజకవర్గాల ఇన్​చార్జిలు, అబ్జర్వర్లతో మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎంపీ సురేశ్ షెట్కార్, సిద్దిపేట, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, పార్టీ అబ్జర్వర్లు రామ్మోహన్ రెడ్డి, మెట్టు సాయికుమార్, చనగాని దయాకర్, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్​చార్జిలు, పీసీసీ ఉపాధ్యక్షులు నవాబ్ ముజాయిద్ అలంఖాన్, బండి రమేశ్, జనరల్ సెక్రెటరీలు జగదీశ్వర్ గౌడ్, ధారా సింగ్, ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.