త్వరలో జాబ్‌‌ క్యాలెండర్‌‌‌‌ : మంత్రి పొన్నం

త్వరలో జాబ్‌‌ క్యాలెండర్‌‌‌‌ :  మంత్రి పొన్నం
  • యువత పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలి మంత్రి పొన్నం
  • ఇప్పటి వరకు 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి 
  • గ్రూప్‌‌ 1 పరీక్షలపై ప్రతిపక్షాలది రాక్షస ఆనందమని మండిపాటు

హుస్నాబాద్, వెలుగు: త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల కానుందని, నిరుద్యోగులు నిరాశ చెందకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ సూచించారు. ఇప్పటికే ఖాళీల వివరాలు సంబంధిత శాఖలకు పంపించామని, త్వరలో భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు. ప్రతిపక్షాలు నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే బదులు వారి పక్షాన సూచనలు చేస్తే మంచిదని హితవు పలికారు. ప్రభుత్వం పారదర్శకంగా నియామకాలు చేపడుతోందని, ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వబోమని స్పష్టం చేశారు. శుక్రవారం హుస్నాబాద్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో ఏర్పడిన లోపాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సహజమని, కోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. 

ఈ పరిణామంపై ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాక్షస ఆనందం పొందుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలు అంశాలపై ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు సాగుతోందని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల పలు నియామకాలు నిలిచిపోయాయని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని చెప్పారు.

 ఇప్పటివరకు రాష్ట్రంలో 65 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో దశలో నియామక ప్రక్రియ కోసం నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. మంత్రి వెంట సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు చిత్తారి పద్మ, కోమటి సత్యనారాయణ, పెసరు సాంబరాజు, మైదంశెట్టి వీరన్న తదితరులు ఉన్నారు.