విభజన హామీలతో తెలంగాణకు రండి..

V6 Velugu Posted on May 13, 2022

హైదరాబాద్ : ప్రజలపై భరించలేనంత భారం మోపుతున్నప్పుడు పాదయాత్రలు ఎవరి మెప్పు కోసం చేస్తున్నారంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీని ప్రశ్నించారు. ఏడేళ్లలో తెలంగాణకు ఏం చేశారో.. ఏం ఇచ్చారో ముందుగా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలన్నారు. తెలంగాణకు శనివారం (ఈనెల 14న) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రానున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభ శనివారం జరగనుంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా తెలంగాణకు ఎందుకు వస్తున్నారో సమాధానం చెప్పాలని మంత్రి సబిత డిమాండ్ చేశారు. 

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదని, కనీసం పాలమూరు రంగారెడ్డికైనా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చినట్లుగానే జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారంటూ ప్రశ్నించారు. రేపటి సభలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామని అమిత్ షా ప్రకటించాలన్నారు.

విద్యా రంగంలో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు చేపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న గురుకులల ఏర్పాటుతో ఇవాళ దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. అన్ని రాష్ట్రాలకు నూతన విద్యాసంస్థలు ఇస్తుంటే తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈ ఏడేళ్లలో ఒక్క విద్యా సంస్థ అయినా ఇచ్చారా..? అని అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదన్నారు. వీటన్నింటిపైనా రేపటి సభలో అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు. ఇవన్నీ తెలంగాణకు ఇవ్వలేదని చెప్పడానికే వస్తున్నారా..? అని ప్రశ్నించారు. కేవలం చుట్టపు చూపుగా వస్తే కుదరదని, అన్ని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. 

ఏడాదికి 16 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ.. ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు. ఐటీఆర్ ఇస్తామని అనౌన్స్ చేయాలన్నారు. రాష్ట్రానికి రావాల్సినవి ఒక్కటి కూడా ఇవ్వకపోవడంపై తెలంగాణపై చూపిస్తున్న వివక్ష ఏంటో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు. 

వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఏలా తప్పించుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. నిత్యవసరాల ధరల పెరుగుదలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గతంలో రూ.400 ఉన్న వంట గ్యాస్ ఇవాళ వెయ్యి రూపాయలు దాటిందన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన హమీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కృష్టా బేసిన్ లో తెలంగాణ వాటా తేల్చాలన్నారు. 

రాజకీయ లబ్ది కోసం బీజేపీ నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. దేశమంతా ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామనే విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, విద్వేషాలు రెచ్చగొట్టొద్దన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

పశ్చిమబెంగాల్ : గ్రామంలో గజరాజు హల్ చల్

నీట్ పీజీ ఎగ్జామ్ వాయిదాకు సుప్రీంకోర్టు నో

Tagged Hyderabad, Telangana, amit shah, Minister Sabita Indrareddy, BJP.Padayatra, Bandi Sanjy

Latest Videos

Subscribe Now

More News