ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు లేవ్

ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు లేవ్

హైదరాబాద్, వెలుగు: దేశంలో ఎక్కడా ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మన రాష్ట్రంలోనూ ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవని ఆమె చెప్పారు. మంగళవారం శాసన మండలిలో తెలంగాణ రాష్ర్ట ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్వాలిటీతో కూడిన మంచి ఎడ్యుకేషన్ కోసమే ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతించినట్టు చెప్పారు.  సర్కారు వర్సిటీలను బలోపేతం చేస్తూ, ప్రైవేటు వర్సిటీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే 24 రాష్ర్టాల్లో ప్రైవేటు వర్సిటీలు ఉన్నాయన్నారు. దేశంలో 950 యూనివర్సిటీలుంటే, వాటిలో 361 ప్రైవేటు వర్సిటీలు ఉన్నాయని చెప్పారు. స్టేట్​లో ప్రైవేటు వర్సిటీలకు16 అప్లికేషన్లు వస్తే, వాటిలో 9 వర్సిటీలకు ఎక్స్​పర్ట్ కమిటీ ఒకే చెప్పిందన్నారు. ఈ అకడమిక్ ఇయర్ లో 5 ప్రైవేటు వర్సిటీలకు అనుమతి ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని  ప్రైవేట్ వర్సిటీల్లో 25 శాతం సీట్లను లోకల్ స్టూడెంట్స్ కు ఇవ్వాలన్న నిబంధన పెట్టామన్నారు.  ప్రైవేటు వర్సిటీలపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నియంత్రణ ఉంటుందని స్పష్టం చేశారు. తెలగాణ వచ్చిన తర్వాత ఇంజినీరింగ్ కాలేజీలను కంట్రోల్ చేశామని, గతంలో 350 కాలేజీలుంటే ఇప్పుడు180 కాలేజీలే ఉన్నాయన్నారు. సర్కారు వర్సిటీల్లో వీసీల రిక్రూట్ మెంట్ కోసం సెర్చ్ కమిటీలు వేశామని, త్వరలోనే వీసీలను
నియమిస్తామన్నారు.

సర్కార్ వర్సిటీలను పట్టించుకోరా?

అంతకుముందు బిల్లుపై ఎమ్మెల్సీలు సతీష్​, శ్రీనివాస్​ రెడ్డి, రాంచందర్ రావు, జీవన్ రెడ్డి, నర్సిరెడ్డి మాట్లాడారు. సర్కారు వర్సిటీల్లో వీసీలు, సిబ్బంది పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్​ రావు ప్రశ్నించారు. ప్రైవేటు వర్సిటీలను ప్రోత్సహించేందుకే సర్కారు వర్సిటీలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్​ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. వీటిని పెట్టుబడిదారులకు అనుకూలంగా ఏర్పాటు చేశారన్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి  ప్రకటించారు. గవర్నమెంట్ వర్సిటీలను అభివృద్ధి చేయకుండా, ప్రైవేటు వర్సిటీలను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఈ సంస్థలు పిల్లలను చదువు చెప్పి చేర్చుకోవడంలేదని, కేవలం ప్రచారం చేసి చేర్చుకుంటున్నాయని అన్నారు.