ఓఆర్ఆర్‌‌ ఎగ్జిట్ ​నం.15ను మూడ్రోజుల్లో అందుబాటులోకి తెస్తం : మంత్రి సబిత

ఓఆర్ఆర్‌‌ ఎగ్జిట్ ​నం.15ను మూడ్రోజుల్లో అందుబాటులోకి తెస్తం : మంత్రి సబిత

శంషాబాద్, వెలుగు : రెండు మూడు రోజుల్లో పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నం.15 వద్ద నిలిచిన వరద నీటిని తొలగించి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రాకపోకలు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు నష్టపోకుండా నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్​కుమార్‌‌ను ఆదేశించారు.

ఇరిగేషన్​ఆఫీసర్లతో కలిసి మంత్రి సబిత, కలెక్టర్​ అమోయ్​కుమార్​ సోమవారం ఎగ్జిట్​నం.15 వద్ద పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షాల టైంలో నర్సింహ చెరువు అలుగు తెరవకపోవడమే ముంపునకు కారణమని పలువురు మంత్రి దృష్టికి తెచ్చారు. చెరువుల వద్ద ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వారిని కొంతమంది అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. మంత్రి సబిత కలగజేసుకుని.. పంట పొలాలు దెబ్బతినకుండా నరసింహ చెరువు తూము లేదా అలుగు తీయాలని చెప్పారు.

రైతులతోపాటు ప్రజల రాకపోకలు కూడా ముఖ్యమేనని తెలిపారు. నీటి తొలగింపు తర్వాత హెచ్ఎండీఏ అధికారులు ఎగ్జిట్ నం.15 వద్ద ముంపు సమస్య తలెత్తకుండా శాశ్వత చర్యలు తీసుకుంటారని చెప్పారు. పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. మంత్రితో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ సంజీవ, ఎంపీడీఓ వసంతలక్ష్మి, ఎంపీఓ ఉషా కిరణ్ తదితరులు ఉన్నారు.