రాజ్ భవన్ నుంచి ఎలాంటి లేఖ రాలేదు : మంత్రి సబిత

రాజ్ భవన్ నుంచి ఎలాంటి లేఖ రాలేదు : మంత్రి సబిత

రాజ్ భవన్ నుంచి తనకు ఎలాంటి లేఖ అందలేదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు గురించి గవర్నర్ లేఖ రాశారని మీడియా, సోషల్ మీడియాలో మాత్రమే చూశానని చెప్పారు. రేపు ఉదయం నిజాం కాలేజీ హాస్టల్ సమస్యపై ఉన్నత విద్యాశాఖాధికారులతో సమావేశం కానున్నట్లు సబిత ప్రకటించారు. అధికారులతో చర్చించిన అనంతరం నిజాం కాలేజీ వ్యవహారంపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. 

యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై సోమవారం అంసతృప్తి వ్యక్తం చేశారు. మూడేండ్లుగా యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ యూనివర్సిటీస్‌‌ కామన్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు బిల్లుపై రాజ్‌‌భవన్‌‌కు వచ్చి చర్చించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డికి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి లెటర్ రాశారు. మరోవైపు రాష్ట్ర సర్కారు కొత్తగా తెచ్చిన కామన్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు బిల్లుపై తమిళిసై యూజీసీ అభిప్రాయం కోరారు. ఈ బిల్లు చెల్లుబాటు అవుతుందో లేదో తెలియజేయాలని సూచించారు.