ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి సత్యవతి సీరియస్

ఫుడ్ పాయిజన్  ఘటనపై మంత్రి సత్యవతి సీరియస్

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై  మంత్రి సత్యవతి రాథోడ్  విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీతో  శుక్రవారం మంత్రి ఫోన్ లో మాట్లాడారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఘటనపై విచారణ చేపట్టడానికి ప్రత్యేక అధికారిని నియమించిన మంత్రి... బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతోందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మెరుగైన చికిత్సతో పాటు నిరంతర  పర్యవేక్షణ కొనసాగుతోందని భరోసా ఇచ్చారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో కలుషిత మంచి నీరు ఇవ్వకూడదన్నారు. సివిల్ సప్లై గోడౌన్లు, గురుకులాల్లోని స్టోర్ రూంలను అధికారులు ఎప్పటికప్పుడూ పరిశీలించాలని ఆదేశించారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.