జడ్జి కుర్చీలో మహిళ ఉంటేనే న్యాయం పరిపూర్ణం : మంత్రి సీతక్క

జడ్జి కుర్చీలో మహిళ ఉంటేనే న్యాయం పరిపూర్ణం :  మంత్రి సీతక్క
  • విమెన్ అడ్వకేట్స్ కన్వెన్షన్​లో మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: న్యాయ దేవతరూపం మహిళదే అయినప్పటికీ.. న్యాయ వ్యవస్థలో మాత్రం మహిళల భాగస్వామ్యం ఇంకా తక్కువగానే ఉందని, ఎప్పుడైతే జడ్జి కుర్చీలో మహిళ కూర్చుంటుందో అప్పుడే న్యాయం మరింత పరిపూర్ణంగా, సమగ్రంగా అమలవుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తనకు కుల, ధన బలం, వారసత్వం లేకపోయినా కేవలం న్యాయవాద వృత్తి ఇచ్చిన ధైర్యంతోనే కష్టాలను ఎదుర్కొని నిర్ణయాధికార స్థానానికి చేరుకున్నానని పేర్కొన్నారు. 

శనివారం ఖైరతాబాద్‌‌‌‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌‌‌‌లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విమెన్ అడ్వకేట్స్ కన్వెన్షన్–2026కు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా 1989లో ఎం ఫాతిమా బీవీ నియామకం చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఆమె నియామకాన్ని కూడా అప్పట్లో రాజకీయం చేశారని, ఆమె టాలెంట్​ను చూడకుండా కులం, మతం అంటగట్టి తక్కువ చేసే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్న వారిలో 30 శాతానికిపైగా మహిళలే ఉన్నా తీరా నల్లకోటు వేసుకొని ప్రాక్టీస్ చేసేవారి సంఖ్య అందులో సగం కూడా ఉండడం లేదన్నారు. తరతరాల వివక్ష సంకెళ్లను తెంచుకొని, అంతరిక్షంలోకి మహిళలు దూసుకెళ్తున్నారని, న్యాయరంగంలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కుటుంబ బాధ్యతలు, తల్లి, చెల్లి, ఇల్లాలి పాత్రలు పోషిస్తూనే న్యాయం కోసం పోరాడుతున్న మహిళా లాయర్ల సేవలు గొప్పవని మంత్రి కొనియాడారు.