- మంత్రి సీతక్క విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో అధికారిక పర్యటనలో ఉన్న ఆమె బుధవారం ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేశారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని, చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసిందని, నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.
విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల వంటి అంశాలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం కమిటీ వేసిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని భారీగా వినియోగించుకుంటున్నారని, సమ్మె వల్ల వారికి ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజలు, ఉపాధి కోసం వెళ్లే కూలీలు, విద్యార్థులు, రోగుల ప్రయాణాలు ఆగిపోకూడదని కోరారు.

