- మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: మహిళలు ఎదిగితేనే దేశం ఎదుగుతుందని, మహిళలు సంపదను సృష్టించగలిగితేనే అభివృద్ధికి నిజమైన అర్థమని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ మహిళల ప్రతిభ, ఆవిష్కరణలు, సామాజిక -ఆర్థిక పురోగతిని ప్రపంచ వేదికపై ప్రతిధ్వనింపజేయడమే గ్లోబల్ సమిట్ లక్ష్యమని పేర్కొన్నారు. గ్లోబల్ సమిట్‌లో భాగంగా ‘వ్యాపార రంగంలో మహిళల నాయకత్వం’పై నిర్వహించిన డిస్కషన్‌లో సీతక్క మాట్లాడుతూ.. దేశంలోనే అతి పెద్ద మహిళా నెట్‌వర్క్‌ను నిర్మించిన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ‘‘రాష్ట్రంలోని మహిళా సంఘాలు గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశలో నడిపిస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు మా ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వడ్డీ లేని రుణాలు అందిస్తున్నం.
మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు, పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు కేటాయిస్తున్నాం” అని చెప్పారు. గ్లోబల్ సమిట్‌లో మహిళా సాధికారతను ప్రతిబింబించే విధంగా ‘ఇందిరా మహిళా శక్తి’ స్టాల్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఎదిగిన మహిళల ప్రయాణాన్ని ప్రతిబింబించే డాక్యుమెంటరీలను అక్కడ ప్రదర్శించారు. కాగా, గ్లోబల్ సమిట్‌తో తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే బీఆర్ఎస్ నేతల గుండెల్లో మంట పుడుతోందని సీతక్క మండిపడ్డారు. సదస్సు విజయవంతం కావడంతో హరీశ్ రావు అసహనం చెందుతున్నారని ఫైర్ అయ్యారు.
