మంత్రిగా తొలిసారి ములుగుకు.. సీతక్క భారీ ర్యాలీ

మంత్రిగా తొలిసారి ములుగుకు.. సీతక్క భారీ ర్యాలీ

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీతక్క తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చారు.  ములుగు మండలం మహ్మద్ గౌస్ పల్లి దగ్గర ఆమెకు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు. బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. మహ్మద్ గౌస్పల్లి నుంచి గట్టమ్మ దేవాలయం వరకు 15 కిలో మీటర్ల మేర ర్యాలీ తీశారు. గట్టమ్మ దర్శనం తర్వాత సీతక్క మేడారం వెళ్తారు. మేడరం జాతరపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. 

ములుగులో గత పదేళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేనే ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధిని అధికార పార్టీ పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ అధికారం చేపట్టడం, ఆ పార్టీ నుంచి ములుగు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన సీతక్క మంత్రిగా చార్జ్‌‌‌‌ తీసుకోవడంతో ఇప్పటికైనా అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయేమోనని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

బిల్ట్‌‌‌‌ పునరుద్ధరణ జరిగేనా ?

ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాలోనే ప్రధానమైన, వేలాది మందికి ఉపాధి కల్పించిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీని 2014లో మూసి వేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కార్మికులు నెలల తరబడి దీక్షలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రాయితీలు ఇస్తామని ప్రకటించారే తప్ప, ఫ్యాక్టరీని ఓపెన్‌‌‌‌ చేసేందుకు మాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ ఫ్యాక్టరీని ఐటీసీ కంపెనీ టేకోవర్‌‌‌‌ చేసిందని కొన్ని నెలల క్రితం ప్రచారం జరిగింది. స్థలాన్ని సర్వే చేసి వదిలేశారే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం, మంత్రి సీతక్క స్పందించి ఫ్యాక్టరీని తెరిపించాలని కార్మికులు కోరుతున్నారు.

మేడారానికి జాతీయ హోదా దక్కేనా ?

ఆదివాసీల ఆరాధ్యదైవాలైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయంపై మంత్రి సీతక్క సైతం కేంద్రానికి విన్నవించారు. అలాగే త్వరలో జాతర జరగనున్నందున పనులు వేగంగా పూర్తి చేయేలా చర్లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా వరంగల్‌‌‌‌ నుంచి మేడారం వచ్చే భక్తులకు ఆరెపల్లి నుంచి గట్టమ్మ వరకు జరుగుతున్న హైవే విస్తరణ పనుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ పనుల్లో వేగం పెంచి జాతర నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. అలాగే ములుగులో బస్‌‌‌‌ డిపో, సెంట్రల్‌‌‌‌ ట్రైబల్‌‌‌‌ వర్సిటీ క్లాస్‌‌‌‌ల ప్రారంభం, ములుగులో మినీ స్టేడియం, పార్కుల నిర్మాణం వంటి పనులు పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు.