
- పేదలకు న్యాయం జరుగుతుంటే ఓర్వలేకపోతున్నరు: మంత్రి సీతక్క
- నివాసితుల ఆమోదంతోనే తరలిస్తున్నం.. శాశ్వత నివాసంతోపాటు ఉపాధి చూపుతున్నం
- ఒక్కో మహిళకు రూ.2 లక్షల రుణం ఇస్తున్నం.. అందులో 1.40 లక్షలు మాఫీ చేస్తున్నట్టు వెల్లడి
- రివర్ బెడ్లో ఇండ్లు ఖాళీ చేసిన 172 మందికి రూ. 2లక్షల చొప్పున రుణం అందజేసిన మంత్రి
- మూసీ ప్రక్షాళనకు మలక్‌పేట్ ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నరు: ఎంఐఎం ఎమ్మెల్యే బలాల
హైదరాబాద్ సిటీ, వెలుగు : మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి సీతక్క మండిపడ్డారు. మూసీలోని పేదలకు న్యాయం జరుగుతుంటే చూస్తూ ఓర్వలేకపోతున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఏరోజూ అక్కడి పేదల భద్రత గురించి ఆలోచించలేదని చెప్పారు. మూసీ రివర్‌బెడ్‌లో ఇండ్లు ఖాళీ చేసిన కుటుంబాలకు కాంగ్రెస్ సర్కార్ రుణాలు మంజూరు చేసింది. శుక్రవారం ప్రజాభవన్‌లో మొత్తం 17 స్వయం సహాయక మహిళా సంఘాలకు చెందిన 172 మంది మహిళలకు రూ.3.44 కోట్ల విలువైన చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. నిర్వాసితుల పిల్లలకు సమీప పాఠశాలల్లో ఉచిత ప్రవేశ పత్రాలతోపాటు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. మూసీ రివర్‌బెడ్‌లోని కుటుంబాల ఆమోదం మేరకే వారిని అక్కడినుంచి తరలిస్తున్నట్టు చెప్పారు. వారికి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయడంతోపాటు మానవతా దృక్పథంతో ఆలోచించి స్వయం ఉపాధి కోసం రుణాలు ఇస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఎన్నో చెరువులున్నాయని, పదేండ్ల కాలంలో గత బీఆర్ఎస్సర్కారు ఒక్క చెరువునుగానీ.. ఒక్క కుంటనుగానీ పునరుజ్జీవనం చేయలేదని తెలిపారు.
మంచి వాతావరణంలో బతకాలి
రాబోయే రోజుల్లో మూసీ నీళ్లతో స్నానం చేయడమేకాదు.. తాగేందుకు పనికివచ్చేలా బాగుచేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ‘‘ఏండ్లనుంచి నివాసం ఉంటున్న ప్రాంతంలో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి మరొక చోటుకు వెళ్లేటప్పుడు కొంత కష్టంగానే ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూసీ నది వరద ఉధృతి పెరిగితే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. మంచి వాతావరణంలో మనం జీవించాలి. మంచి గాలి, నీళ్లు దొరికే ప్రదేశంలో జీవనం సాగించాలి. ఒక తరం మూసీ నదీ పరీవాహక ప్రాంతంలో ఇబ్బందుల్లో నివసించారు. రేపటి తరమైనా మంచి వాతావరణంలో బతికేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది” అని పేర్కొన్నారు. మూసీ రివర్ బెడ్ నుంచి డబుల్ ఇండ్లకు తరలిన కుటుంబాల్లోని మహిళలకు రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఒక్కో మహిళలకు రూ.2 లక్షలు రుణంగా ఇస్తున్నామని, ఇందులో రూ.1.40 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుందని, కేవలం రూ.60 వేలు మాత్రమే నెలనెలా మహిళా సంఘాలు కట్టాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం అందించే సాయంతో మంచి వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. మూసీ పునరావాస మహిళలకు కుట్టు మిషన్లను సైతం అందజేస్తామని తెలిపారు. వివిధ రకాల వ్యాపారాల్లో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తామని, పునరావాసం పొందిన వారి పిల్లలకు అన్ని రకాల విద్యా సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.
చిన్న సమస్యలకు త్వరలో పరిష్కారం : బలాల
మూసీ ప్రాజెక్టు కు మలక్ పేట్ ప్రజలు స్వచ్ఛందంగా సహకారం అందిస్తున్నారని మలక్ పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే బలాల అన్నారు. డబుల్ ఇండ్లలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో సర్కార్ పరిష్కరిస్తుందని తెలిపారు. మంచి నీళ్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్వోఆర్ ప్లాంట్ లను ఏర్పాటు చేయాలని కోరారు. పిల్లలను స్కూళ్లలో జాయిన్ చేయడంతో పాటు ప్రభుత్వం ఇతర వసతులను కల్పిస్తున్నదని తెలిపారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి కుట్టు మిషన్లు కూడా అందించాలని మంత్రి సీతక్కను కోరగా.. ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ ఎమ్మెల్యే కౌసర్ మొహినొద్దీన్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, ఐఏఎస్ గౌతమి, హైదరాబాద్ డీఈవో ఆర్. రోహిణి, హైదరాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి అక్కేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.
మంచిగ వ్యాపారాలు చేస్కుంటం
మేము దిల్సుఖ్ నగర్ శాలివాహన నగర్ నుంచి ప్రతాప సింగారంలోని డబుల్ బెడ్ రూం ఇండ్లకు వెళ్లాం. మాకు అక్కడ వసుతులు బాగున్నయి. మా పిల్లలను స్కూళ్లలో కూడా జాయిన్ చేస్తున్నరు. ఇప్పుడు మాకు ఉపాధి కోసం 2 లక్షల రుణాలు కూడా ఇచ్చారు. వివిధ వ్యాపారాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నం. ఫుడ్, పండ్ల బిజినెస్, కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకుంటం. ప్రభుత్వం మా ఉపాధి కోసం 2 లక్షల రుణం ఇవ్వడం, అందులో 70 శాతం మాఫీ చేయడం చాలా సంతోషంగా ఉంది.
- శివ శక్తి మహిళా పొదుపు సంఘం, ప్రతాప సింగారం
కిరాణా షాపు పెట్టుకుంటా..
మూసీ రివర్ బెడ్ లో ఉన్నప్పుడు ఇండ్లలో పని చేసుకునేదాన్ని. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షలతో కిరాణా షాపు పెట్టుకుంట. మా కాళ్లమీద మేం నిలబడేలా సాయం చేస్తున్న రేవంత్ సార్‌కు రుణపడి ఉంటం. మా బతుకులు మార్చుకుంటం.
- ఎల్లమ్మ, ప్రతాప సింగారం
సద్వినియోగం చేస్కుంటం
మేం దిల్సుఖ్నగర్ నుంచి వనస్థలిపురం డబుల్ బెడ్ రూం ఇండ్లకు వెళ్లినం. మాకు వసతులు బాగున్నయి. మూసీ ఒడ్డున బతికే మాకు ప్రభుత్వం ఇండ్లు ఇచ్చి, ఉపాధి కల్పించింది. మా గ్రూపులో పది మంది ఉన్నం. మా అభివృద్ధి కోసమే 2 లక్షల రుణాలు ఇస్తున్నరు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అభివృద్ధి చెందుతం.
- జై భవానీ మహిళా పొదుపు సంఘం, వనస్థలిపురం
చాలా ఆనందంగా ఉంది
మేం శంకర్ నగర్ నుంచి డబుల్ బెడ్రూం ఇండ్లకు వచ్చినం. ప్రభుత్వం వ్యాపారం చేసుకోవడానికి 2 లక్షలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అధికారుల సూచనలతో మేం వ్యాపారాలు చేసుకుంటం. కిరాణా షాపు, పండ్ల దుకాణం, టైలరింగ్, కూరగాయల దుకాణం.. ఇట్లా రకరకాల వ్యాపారాల చేసేందుకు మేం రెడీగా ఉన్నం.
- సానియా మహిళా పొదుపు సంఘం, పిల్లిగుడిసెలు, మలక్ పేట్