ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. మిడిల్ ఈస్ట్ దేశాల్లో CBSE పరీక్షలు వాయిదా

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. మిడిల్ ఈస్ట్ దేశాల్లో CBSE పరీక్షలు వాయిదా

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో CBSE పరీక్షలను బోర్డ్ వాయిదా వేసింది. సోమవారం జరగాల్సిన క్లాస్ X, క్లాస్ XII పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. మార్చి 3న పరిస్థితులను సమీక్షించి.. మార్చి 5 నుంచి పరీక్షలను నిర్వహించే యోచనలో ఉన్నట్లు బోర్డ్ తెలిపింది. బెహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో CBSE పరీక్షలు రాసే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని బోర్డ్ కంట్రోలర్ డాక్టర్ సన్యాం భరద్వాజ్ తెలిపారు.

ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. మిడిల్ ఈస్ట్ దేశాలపై ఇరాన్ దాడులు మరింత పెరిగాయి. ఇరాన్‌‌లోని మొత్తం 31 ప్రావిన్స్‌‌లకుగాను 24 ప్రావిన్స్‌‌లపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయి. 200 మందికి పైగా మృతి చెందారని, 747 మంది గాయపడ్డారని ఇరానియన్ రెడ్ క్రీసెంట్ సంస్థ వెల్లడించింది. దాడులు ప్రారంభమైన తర్వాత ఇరాన్ అధికారికంగా ప్రకటించిన సంఖ్య ఇదే కావడం గమనార్హం.

ఇజ్రాయెల్, అమెరికా దళాలు శనివారం జరిపిన భారీ వైమానిక దాడుల్లో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ఇరాన్‌‌‌‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక బాలికల పాఠశాలపై బాంబులు పడటంతో విద్యార్థినులు సహా 85 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మంది గాయపడ్డారు. తాజా ఆపరేషన్‌‌‌‌లో తమ భూభాగంపై మరణాలు సంభవించినట్లు ఇరాన్ ధృవీకరించడం ఇదే మొదటిసారి. మినాబ్ నగరంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌‌‌‌కు చెందిన కీలక స్థావరం ఉండటంతో, ఆ స్థావరం టార్గెట్ గా ఇజ్రాయెల్, అమెరికా ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై వైట్ హౌస్ లేదా ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు.

కాగా, తాము జరిపిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పాక్‌‌‌‌పూర్ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలన్నీ తమ గగనతలాలను పూర్తిగా మూసివేశాయి. ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని గాలిలోనే కూల్చివేస్తున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ వ్యాప్తంగా ప్రమాద హెచ్చరికల సైరన్లు మోగుతున్నాయి. పరిస్థితి ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది.