వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫర్ విలేజ్..అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క

వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫర్ విలేజ్..అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే ముప్పు ఉన్నందున, గ్రామాల్లో ప్రజలకు నిరంతరం ఉపాధి కల్పిస్తూనే నీటి సంరక్షణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి వీడండి.. వర్క్ ఫ్రమ్ విలేజ్, వర్క్ ఫర్ విలేజ్ నినాదంతో పనిచేయండి’అని ఆమె పిలుపునిచ్చారు.

ఉపాధి హామీ పథకం అమలుపై బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, సీఈవోలు, డీఆర్డీవోలు, కార్యదర్శులతో పాటు 12 వేలకు పైగా సర్పంచులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నినో వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే భూగర్భ జలాలు పడిపోయి, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని, అందుకు తగ్గట్లుగా ఉపాధి హామీని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచంలా మార్చాలని దిశానిర్దేశం చేశారు.