మూగజీవాలకు విషమిచ్చి చంపడం దారుణం : మంత్రి సీతక్క 

 మూగజీవాలకు విషమిచ్చి చంపడం దారుణం : మంత్రి సీతక్క 
  • కుక్కలకు విష ప్రయోగంపై విచారణ కొనసాగుతోంది: మంత్రి సీతక్క 

హైదరాబాద్, వెలుగు: మూగజీవాలకు విషమిచ్చి చంపడం దారుణమని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలకు విష ప్రయోగం చేసి చంపినట్లు పత్రికా కథనాల ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని, ఇప్పటికే పోలీసు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో వాటిని అమానుషంగా చంపడం చట్టవిరుద్ధమన్నారు.

ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. కొన్ని గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయం సర్పంచుల దృష్టికి రావడం సహజమేనని, ఆ సమస్యకు పరిష్కారమనేది చట్టబద్ధంగా, శాస్త్రీయంగా, మానవీయ మార్గాల్లో చేయాలి కానీ, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. వీధి కుక్కల నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకాలు, కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) వంటి శాస్త్రీయ పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని పంచాయతీలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని ఆమె తెలిపారు.