నిజాయితీకి నిలువుటద్దం ఓంకార్..ఆయన బాటలోనే నేను తుపాకీ పట్టా.. ఎమ్మెల్యేనయ్యా! : మంత్రి సీతక్క 

నిజాయితీకి నిలువుటద్దం ఓంకార్..ఆయన బాటలోనే నేను తుపాకీ పట్టా.. ఎమ్మెల్యేనయ్యా! : మంత్రి సీతక్క 
  • ట్యాంక్ బండ్‌‌‌‌పై ఆయన విగ్రహం పెట్టేందుకు కృషి చేస్తానని హామీ
  • రవీంద్ర భారతిలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే ఓంకార్ శత జయంతి వేడుకలు

హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ అని మంత్రి సీతక్క కొనియాడారు. మంగళవారం రవీంద్ర భారతిలో ఓంకార్ శత జయంతి వేడుకలు జరిగాయి. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి సీతక్కతో కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బీవీ రాఘవులు పాల్గొని ఓంకార్‌‌‌‌కు నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ‘ఓంకార్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. ఆయనలాగే నేను కూడా ప్రజల కోసం తుపాకీ పట్టాను. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాను. క్రమశిక్షణ, ఉద్యమ పాఠాలు ఆయన నుంచే నేర్చుకున్నాను. నిరంతరం ప్రజల కోసం పరితపించిన ఓంకార్ లేని లోటు నర్సంపేటకే కాదు యావత్ తెలంగాణకు తీరని లోటు.

ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఏ శక్తులకు లొంగకుండా రాజకీయాలకు విలువలు అద్దిన రాజకీయ దురంధరుడు ఓంకార్’​ అని ఆమె పేర్కొన్నారు. ట్యాంక్ బండ్‌‌‌‌పై ఓంకార్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న అభిమానుల కోరికను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 

ఆపరేషన్ కగార్ పేరుతో గొంతులు నొక్కుతున్నరు: కూనంనేని 

ప్రజలను మోసం చేసే రాజకీయ పార్టీలు ఎక్కువయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను నిర్మూలించాలని చూస్తోందని మండిపడ్డారు.

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. నేటి కాలంలో ఓంకార్ లాంటి నాయకుడు చట్టసభలో ఉన్నా. ఆయనను మాట్లాడనిచ్చేవారు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి అశోక్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చలపతిరావు పాల్గొన్నారు.